అమ్మో మొసలి... సాధారణంగా మొసలి పేరు వింటేనే జనాభాలో ముప్పాతిక శాతానికి మలేరియా జ్వరం వచ్చినట్లు గజగజ వణికిపోతారు.నాకైతే ఆ పేరు వింటే వణుకుడుతో పాటు ఠంచనుగా ఐమాక్స్ లో రెండు కథలు గుర్తుకు వస్తాయి.మొదటిది గజేంద్రోపాఖ్యానం లోనిది, భూలోకంలోని ఓ కొలనులో మొసలి బారిన చిక్కుకున్న తన భక్తుడైన గజేంద్రుడిని రక్షించడం కోసం శ్రీ మహావిష్ణువు పడకమందిరం నుండే యెకాయెకిన పరుగు పరుగున బయల్దేరి వెళ్ళి,తన చక్రాయుధంతో మొసలిని సంహారించడం.ఇక రెండవది పంచతంత్రంలోనిది, ఆశగొండి మరియు ఆకలిగొండి అయిన తన ముద్దులభార్య పేరాకలి తీర్చడంకోసం తన స్నేహితుడైన కోతి గుండెకాయకే ఎసరు పెట్టాలని బయల్దేరి... తెలివైన తన కోతిమిత్రుడి చేతిలో భంగపాటుకు గురైన ఓ మందమతి మొసలి కథ. మనందరము మొసలి అంటేనే మొహం చిట్లిస్తాము, పైగా దాన్ని గబ్బర్ సింగ్ ను చూసినట్లు చూస్తాము( అంటే లేటెస్ట్ గబ్బర్ పవన్ కళ్యాణ్ కాదు,..పురానా గబ్బర్.. అంటే విలన్ అని నా ఉవాచ).పైగా ఎవరైనా రాజకీయనాయకులు తన ప్రజానీకం కష్టాలను చూసి తట్టుకోలేక కన్నీరు ఒలికిస్తే " మొసలి కన్నీరు కారుస్తున్నారని" ఎకసెక్కాలు ఆడుతాము.
కానీ తైమూరు ప్రజలకు అలా కాదు, మొసలి అంటే వారి దృష్టిలో సాక్షాత్తు శ్రీమన్నారయణ అవతారం( సారీ..ఫ్లో లో అలా వెళ్ళిపోయింది, నిజానికి నారాయణుడితో వీరికేమి సంబంధం లేదు..ఐ మీన్ దైవంతో సమానమని)..ఇక మొసలి కంట కన్నీరు ఒలికిందా దేశానికి అరిష్టం, అందరికి పోయే కాలం ముంచుకొచ్చిందనే ఘాఠ్ఠిగా అనుకుంటారు.ఈ దేశంలో మొసళ్ళను పట్టడం, వేటాడడం, చంపడం లాంటి మొసళ్ళ హానికర చర్యలు పూర్తి గా నిషిద్దం...ఒకవేళ మొసలి ఎవరిపైన దాడి చేసినా కూడా, అయ్యోపాపం అని దాడికి గురైనవాడిపై కాస్తా కనికరం కూడా చూపించరు, పైగా వీడేదో మహాపాపానికి ఒడిగట్టాడు అందుకే "మొసలి దేవుడు"శిక్షించాడని దాడిని సమర్థిస్తారు. అన్ని రకాల పాకే,వాకే,ఎగిరే,ఈదే జీవులను బ్రేవ్ మని భోంచేసే తైమూర్ సోదరులు మొసలికి మాత్రం మినహాయింపు ఇచ్చారు..మొసళ్ళ భక్షణ కాదు సంరక్షణే మా ధ్యేయం అంటారు. తైమూరు ప్రజల "మొసలి ప్రేమను" చూసి ప్రముఖ మొసళ్ళ వేటగాడు స్టీవ్ ఇర్వీన్ తెగ సంబరపడిపోయేవాడట( పాపం అంత పెద్ద మోనగాడు కూడా స్టింగరీ అనే ఓ బుల్లి చేప దెబ్బకు బలైపోయాడు, సప్త సముద్రాలు దాటి వచ్చి మురికికాల్వలో పడి చావడం అంటే ఇదేనేమో.... ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరూ...)మొసళ్ళ సంరక్షణకు ఓ టాస్క్ ఫోర్స్ ఏర్పాటుకు, ఇతర సలహాలు, సూచనలు తెగ ఇచ్చేసి వెళ్ళిపోయాడు. వీళ్ళ మొసళ్ళ ప్రేమ ఎంతవరకు వెళ్ళిందంటే, జనాభాలో 60 శాతం మంది మగవాళ్ళ హెయిర్ స్టైల్,ముఖ్యంగా యూత్ అయితే దాదాపు 80 శాతం మంది తల మీది బొచ్చును కూడా మొసలి ని గుర్తుకు తెచ్చేలా కట్ చేయిస్తారు.అసలు మొసళ్ళ పట్ల ఇంత అవ్యాజ్యమైన ప్రేమ ఎందుకు చెప్మా అంటే, అసలు తమ అస్థిత్వానికి మూల పురుషుడు మొసలే అంటారు, తమదంతా "మొసలి వంశమని" కాలరెగిరేస్తారు. తైమూరు ప్రజలకు, మొసలికి ఉన్న అవినాభావ సంబంధం గూర్చి వాడుకలో ఓ జానపదం ప్రచారంలో ఉన్నది. దాని ప్రకారం.....
అనగనగా ఓ చిన్న కొలను, అందులో ఓ బుజ్జి మొసలి ఉండేది. చూడ్డానికి బుజ్జిదే అయినా బుర్రంతా బడా ఆలోచనలు, హైస్కూల్ పోరగాడు ఐఏయస్ కావాలని కలలు కన్నట్లు మన బుజ్జిమొసలికి కూడా ఆ కొలనునుండి త్వరాగా బయటపడి, సముద్రంలో తన ప్రతాపం చూయించాలని తెగ ఆరాటపడేది.ఇంతలో ఆ ప్రాంతంలో తీవ్రమైన దుర్భిక్షపరిస్థితులు ఏర్పడ్డాయి,కొలనులో నీళ్ళు అడుగంటిపోసాగాయి.ఇక అక్కడుంటే తనకు నూకలు చెల్లినట్లేనని భావించిన బుజ్జి మొసలి, ఎలాగు సముద్రం చేరాలనే తన ఆశయం కూడా నెరవేరినట్లవుతుంది అని సముద్రం వైపు వెంటనే ప్రయాణం మొదలు పెట్టింది. ఎంత ప్రయాణం చేసినా సముద్రం అంతూ పొంతూ దొరకడంలేదు, ఓ వైపు మల మాడిస్తున్న సూర్య ప్రతాపం మరో వైపు అల్లల్లాడిస్తున్న ఆకలి ప్రతాపం, ఇక తన పని అయిపొయినట్లేనని బుజ్జి మొసలి ఢీలా పడిపోయింది.ఇంతలోఅటుగా వెళ్తున్న ఓ చిన్నారి బాలుడు బుజ్జి మొసలి బాధను చూసి దాన్ని తన చేతుల్లోకి తీసుకొని వడి వడిగా సముద్రాన్ని చేరుకొని,నీళ్ళల్లో వదిలాడు.ఒక్కసారి నీళ్ళల్లో పడగానే వెయ్యేనుగుల బలం వచ్చినట్లయింది,తనకు ప్రాణభిక్ష పెట్టిన చిన్నారిని మిత్రుడిగా, సోదరుడిగా బుజ్జి మొసలి భావించి, ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఒడ్డుకు వచ్చి తనను పిలవమని చెప్పి సముద్రంలోకి వెళ్ళి పోయింది.
కొంత కాలం గడిచింది...ఓ రోజు బాలుడు సముద్రం ఒడ్డుకు వచ్చి మొసలి సొదరుడిని పిలిచాడు, వెంటనే మొసలి వచ్చింది. మొసలితో బాలుడు" సోదరా నాకు ప్రపంచం చుట్టి రావాలని ఉంది" అని అన్నాడు."ఒస్ అదెంత పని నీవు నా వీపు మీద కూర్చో, నేనంతా చూపిస్తాను" అని మొసలి అని బాలుడిని తన వీపుపైన కూర్ఛొపెట్టుకొని సముద్రప్రయాణం ప్రారంభించింది. ప్రయాణంలో కొన్ని రోజులు గడిచాకా మొసలికి బాలుడిని తినాలన్న కోరిక కలిగింది, కాని ఓ వైపు మనస్కరించక సముద్రంలోని చేపలను, తాబేళ్ళను ఇతర అన్ని జీవులను సలహా అడిగింది..ఎవరిని అడిగినా కూడా " సహాయం చేసిన వాడికి హాని తలపెట్టడం మహాపాపం" అనే చెప్పాయి...అయినా కూడా బాలుడిని కరకర నమిలేయాలనే ఆలోచనతో ఏ ఒక్కరైనా తనను సపోర్ట్ చేయకపోతారా అని కనపడ్డ జీవినల్లా సలహా అడిగింది..కాని ఎవరినుండి కూడా తప్పుడు సలహా రాలేదు..మొసలి ఆలోచనలో పడింది" నిజమే కదా నాకు ప్రాణభిక్ష పెట్టిన సోదరుడిని మట్టుబెట్టాలనుకోవడం ఎంత పాపం" అని తీవ్రంగా ఆవేదన చెందింది. పశ్చాతాపంతో దహించుకుంటూ బాలుడితో " సోదరా నన్ను కాపాడిన నిన్నే కడతేర్చాలని అనుకున్నాను, నా వల్ల ఘోర అపరాధం జరిగింది.ఇప్పుడు నేను ప్రాయశ్చిత్తం చేసుకుంటాను...నేను చనిపోతాను, నా శరీరంపైన నీవు నివసించి నీ వంశాన్ని అభివృద్ది చేయి" అని తైమూరు తీరానికి వచ్చి మొసలి ప్రాణం వదిలింది.ప్రాణం వదిలిన మొసలి పెరిగి, పెరిగి పెద్ద భూభాగంగా ఏర్పడింది,దాని వొంటి మీదనున్న పొలుసులు పెద్ద పెద్ద పర్వతాలు గా ఏర్పడ్డాయి. మొసలి సోదరుడి కోరిక మేరకు బాలుడు పెరిగి పెద్దవాడై పిల్లా,జెల్లతో వంశాన్ని అభివృద్ది చేసాడు..ఆ వంశాంకురాలే నేటి తైమూరు ప్రజలు. ఈ జానపదం నిజమైనదని తైమూరు ప్రజలు బలంగా విశ్వసిస్తారు.అంతగా అనుమానం ఉంటే ఓ సారి తైమూర్ మ్యాప్ ను తెరిచి చూడమంటారు.
నిజమే కావాలంటే తైమూర్ చిత్రం చూడండి అచ్చుగుద్దినట్లు మొసలి ముఖంలాగా అనిపించడంలేదూ..అన్నట్లు తైమూర్ ప్రజలు సముద్రంలోకి దిగేప్పుడు "ఓ లఫాయి ( అంటే టెటున్ భాషలో మొసలి అని అర్థం) మేము నీ వంశస్తులము, మాకు హాని తలపెట్టకు" అని దూకుతారట. అలా ప్రార్థించి దిగితే తమ తాతలూ,ముత్తాతలు అయిన మొసళ్ళు ఏమి చేయవని వీరి ధీమా!అయితే ఈ కథంతా చదివి మీరూ ఓ ట్రయల్ వేయకండోయ్, ఈ మినహాయింపు కేవలం తైమూరువాసులకే, మీరు దిగారో కరకరకరకరకరకరకరకరే.... ఇదండీ బాబూ తైమూరు ప్రజల “మొసలి ప్రేమ” వెనక ఉన్న అసలు కహానీ. వచ్చేవారం మరో కహానీ చెప్పుకుందాము, అంతవరకు సెలవు మరి...