|
నోరూరిస్తున్న జవ్వాజి స్పెషల్ |
అసలు భారతదేశంలో ఆడాళ్ళను వంటింటికి పరిమితం చేసి మన పూర్వీకులు పెద్ద తప్పు చేశారనే చెప్పాలి.దాంతో ఆడవారు "వంటింటి మహారాణుల్లా" వెలిగిపోతూ వారికి నచ్చింది, తాము మెచ్చింది మన మోహాన వండి పడేస్తూ "సరి లేరు మాకెవ్వరూ" అని గరిటల విన్యాసం చేస్తున్నారు.కాని మన మగధీరులకు అవకాశం దొరకాలే కాని వంటింటిని కూడా ధడ ధడలాడించేయమని అంతర్జాలముఖంగా అందరికీ విన్నవిస్తున్నాను..ఒక్కసారి భూత,భవిష్యత్,వర్తమాన చరిత చూస్తే " పాకరంగాన" మనవాళ్ళకు ఎంత పట్టుందో తెలిసిపోతుంది.అలనాడు నలుడు, భీముడు మొదలుకొని, ఆడాళ్ళు కూడా అసూయ పడేలాగ "పాక ప్రావీణ్యాన్ని" ప్రదర్శిస్తున్న నేటి సంజీవ్ కపూర్ వరకు మన మగధీరులకు ఎదురులేదు..తేడా అల్లా మనము "అంగనల్లా"గా అవకాశం దొరికినప్పుడల్లా ఇలా చేసాము,అలా చేసాము అని "ప్రచారం" చేసుకోము, కిరీటాలు ధరించము..అసలు మాట వరుసకు కూడా "నలభీమ పాకం" అంటారే కాని, ఏ సావిత్రీ పాకమో, అనసూయ పాకమో అని ఎవరూ కూడా అనరు. ఈ ఘనచరితతోనే మగధీరుల "గరిట పవర్" పై గతంలో కొంత నమ్మకమున్నా కూడా ఈ తైమూరు వచ్చాక అది మరింత బలపడింది.
|
ఎంతవారలైనా....గరిటదాసులే |
ఇక అసలు విషయం ఏమిటంటే....ఐరాస శాంతి పరిరక్షణలో భాగంగా తైమూర్ వచ్చాక, వంటింటిని ప్రయోగవేదిక చేయడం "తప్పనిసరి"అయింది. గతంలో భాగ్యనగరంలో తలవని తలంపుగా, ఏమారుపాటునో, నా గ్రహపాటునో నా కాలు వంటింట్లో పడిందా....ఆ వెంటనే నా భార్యామణి " వంటింట్లో ఆడాళ్ళలాగా మీకేం పని" అని గాండ్రించేది ( అదేదో నేను ఆమె సామ్రాజ్యాన్ని ఆక్రమించుకుంటున్నట్లు). కానీ ఇక్కడ " హమ్ ఆజాదీ హై"..అయినా ఇక్కడి హోటళ్ళూ, తిండీ మన వంటికి పడవు, అన్నిరకాల జంతుజాలాన్ని వండివార్చగల ఘనులు ఇక్కడి తైమూరీవాసులు. అదీగాక నేను ఉద్యోగం చేస్తున్నది ఓ అందమైన, ఏమీ అందుబాటులో లేని గ్రామీణ ప్రాంతంలో.. సో తప్పనిసరిగా నాకు ఓ చేతిలో "గన్ను" మరో చేతిలో "గరిట"తో సహావాసం చేయక తప్పడం లేదు. ఈ తప్పనిసరి తిప్పలు(నో..నో..అందమైన అనుభవాలు) నాకొక్కడికే కాదు, నాతోపాటు మిషన్ లో పని చేస్తున్న " చప్పన్నదేశాలకు"చెందిన "మగధీరులందరిదీ" ( మిషన్ లో పని చేస్తున్న ఆడపులుల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు, ఎందుకంటే ఏ దేశానికి చెందిన ఆడవారైనా ఈ రంగానా తామే నంబర్ వన్ అని తెగ ఫీల్ అవుతుంటారు).
|
గాంబియన్ మిత్రులు ఎన్సా,కబ్బా లతో బార్బెక్యూ చికెన్ తయారీ |
తైమూరులో నా "గన్నూగరిటల సహాజీవనం" కంటే ముందూ "గరిట"తో నాకున్న అవినాభావ సంబంధాన్ని ఓసారి నెమరేయాల్సిందే.. ఇంటర్మీడియెట్ చదవడం కోసం నేనూ, నా బాల్యమిత్రుడు నర్సింగ్ జడ్చర్లలో మా మేనమామ "రవి"(ప్రస్తుతం ఐపియస్ అధికారి) రూంలో అడుగుపెట్టిన రోజులవి, అప్పటికే ఆయన "సీనియర్" అవడం వల్లా రూం బరువూ,భాద్యతల పంపకాలలో మావాడి చేతిలో "చీపురు" (శుభ్రత,పరిశుభ్రత) నా చేతికి "గరిట"(వంటావార్పు) అప్పచెప్పాడు.ఇక ఓవరాల్ సూపర్ విజన్,వీటో పవర్ మా "సీనియర్" చేతుల్లో ఉండేవన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా.... అలా "గరిట"తో పసికూన గా నా సావాసం మొదలైంది. అసలే వంటకు కొత్త, ఇక మా ప్రయోగాలతో మా వంటిల్లు "భీభత్సంగా"ఉండేది(తొక్కలోది ఉన్నది ఒకే రూము, పైగా వంటిల్లు ఒకటి..అంత సీను లేదు కాబట్టి"సింగిల్ రూం" అనే చదువుకొనుమూ). దానికి తోడూ అప్పుడప్పుడూ మా నర్సింగ్ ప్రదర్శించే "చేతివాటం" ( వాడి బాధ వాడిది...తన పాకప్రావీణ్యాన్ని ప్రదర్శించి, సీనియర్ ను మెప్పించి ప్రమోషన్ కొట్టేయాలని).. వాడు "పోపు"(అదేనండీ "తాళింపు") పెడితే చుట్టుపక్కలనున్న నాలుగిండ్లకు ఆ "ఘాటు" దెబ్బ తగిలేది, ఒక్కొసారి మా పక్కవాటా వాళ్ళు దగ్గుతూ,తుమ్ముతూ, నానా రకాలుగా ఆయాసపడుతూ మా "సింగిల్ రూంలో" ఏమైనా అగ్నిప్రమాదం సంభవించిందా అని పరుగెత్తుకుంటూ వచ్చేవారంటే నమ్మండీ..ఇక ఓసారి "రీల్" వేసుకోని చూడండి మావాడి "పోపు పొగలు" . ఇదే కాదండోయ్ మావాడికి మహా "దూరదృష్టి", చేసే "కర్రీ" రెండుపూటలా సరిపోవాలని, నేను ఏమరుపాటుగా ఉన్నది చూసి స్టవ్ మీద ఉడుకుతున్న కూరలో "ఠకీమని" ఓ గ్లాసు నీళ్ళు పోసి ఏమీ తెలియనట్లు సైలంట్ గా ఉండేవాడు..వాడిని కంట్రోల్ చేయాలని నేనూ, మా సీనియర్ శతధా ప్రయత్నించినా ఎక్కువసార్లు వాడిదే"విజయం"..
అలా మొదలైన నా "గరిట ప్రస్థానం" డిగ్రీ అయ్యేవరకి ఫర్వాలేదనిపించే స్థాయికి ఎదిగింది. తర్వాత "ఉస్మానియా"లో, ఆ తర్వాత "పోలీసు"లోకి చేరాకా "గరిట"కు తాత్కాలికంగా తలాక్ చెప్పాల్సివచ్చింది. అయితే గరిట విన్యాసాలకు దూరం అయినా కూడా " గరిటధారులను, పాక ప్రావీణ్యులను" ఓ కంట కనిపెడ్తూ, ప్రోత్సహిస్తుండేవాడిని.ఉస్మానియా యూనివర్సిటీ "ఏ"హస్టల్ మెస్ లో సాంబయ్య చేసే "సాంబారు"ను మా మిత్రబృందం "అహా! ఓహో!" అంటూ మెచ్చుకుంటుంటే బక్కపీచు సాంబయ్య ఛాతీ అమాంతం సిబియస్ బస్టాండంత విస్తారం అయ్యేది . మేము విసిరే కాంప్లిమెంట్ల కోసం సాంబయ్య అటూ, ఇటూ కాలు కాలిన పిల్లిలా మా చుట్టూ రౌండ్ల మీద రౌండ్లు వేస్తుండేవాడు.దానికి తోడూ మేమేనాడు సాంబయ్యను ఏ కోశానా నిరాశపరచలేదు( ఎంతైనా సాటి గరిటవీరుడికి ఆ మాత్రం గౌరవం ఇవ్వకుంటే ఎలా?).
|
చపాతీ తయారీలో బిజీగా ఉన్న మా కమాండర్ సుధాకర్ ఉపాధ్యాయ |
ఇక ఇన్ని సంవత్సరాల "గరిట వియోగం" తప్పనిసరిపరిస్థితుల్లో తైమూరులో తీరిపోయింది. ఇక్కడ నేనూ, మా ఉమా మహేశ్వరరావు( హైదరాబాద్ ఇన్స్ పెక్టర్) తో కలిసి వంటింట్లో పట్టపగ్గాలు లేకుండా వీరంగం చేస్తున్నామనే చెప్పాలి. "వృత్తి"లో ఆయన నాకు సీనియర్ అయినా "ప్రవృత్తి"లో మాత్రం నేనే సీనియర్..సో, మామూలుగానే నేను "మెయిన్ ఛెఫ్"బాధ్యతలు స్వీకరించినప్పటికీ ఉమారావు అభివృద్దిని తక్కువ చేయడానికి వీలు లేదు. నేను తనతో జాయిన్ కాకముందు వంట రాక కొన్నిసార్లు పస్తులుండే పరిస్థితి పోయి ప్రస్తుతం అప్పుడప్పుడు "చప్పన్నదేశాల"కు చెందిన మిత్రులందరం కలిసి చేసుకునే ఫంక్షన్లకు "పప్పు" సప్లయి చేసే స్థాయికి ఎదిగిపోయాడు.మేమే కాదు, ఇక్కడ మాతో పాటు పని చేస్తున్న మగధీరులందరూ కాకలుదీరిన గరిటధారులే..ఈజిప్ట్ కు చెందిన బ్రిగేడియర్ హెగజీ చేసే "బట్టర్ రైస్" ముందు చేయి తిరిగిన ఆడపులులు చేసే ఏ వంట అయినా బలాదూరే..ఇక దానికి తోడూ గాంబియన్ మిత్రులు చేసే "బార్బెక్యూ చికెన్" ముక్క ఒక్కటి పంటి కింద పడిందా, నా సామిరంగా "ఇదిరా జీవితం" అని అనిపించకుంటే మీ మీద ఒట్టే. ఐరాస మిషన్ లో ఉన్న ఈ బలవంతపు ఎంజాయ్మెంట్ కు ఎవరూ అతీతులు కారు. ఈ మధ్య ఎన్నికల బందోబస్తుకు మా దగ్గరికి వచ్చిన మన ఇండియన్ కమాండర్ ఓ డిఐజీ గారు మా " ప్యాలెస్" లో చపాతీ పిండిని ఓ పట్టు పట్టి పోయారు.
|
నా పప్పు రెడీ! |
వంటింట్లో ప్రయోగాలు చేయడానికి ఇదీ పర్ఫెక్ట్ అయిన వేదిక..పప్పూ,సాంబారు,కుక్కగొడుగులు, అడ్డమైన ఆకుకూరలు వగైరాలను నానా రకాలుగా నేనూ, ఉమారావు ప్రయోగాలు చేస్తూనే ఉన్నాము. కొన్నిసార్లు సఫలం మరికొన్నిసార్లు అడ్దంగా విఫలం...అట్టర్ ఫ్లాప్ అయినా కూడా ఆత్మవిశ్వాసం కోల్పోని "థామస్ ఆల్వా ఎడిసన్"లాగా ఎప్పుడూ మా మీద , మా ప్రయోగాల మీద నమ్మకం కోల్పోకుండా " వహ్వా! వహ్వా! అహా!ఓహో!" అని ఒకరి భుజాలు మరోకరం చరుచుకుంటూ " గరిట ప్రస్థానం" కొనసాగిస్తున్నాము. మొదట్లో నేను,కెరళ మిత్రుడు "రాజన్" చపాతీలూ చేయడానికి సిద్దపడ్డప్పుడు నానా అనుభవాలు..అదేంటోగాని చపాతీ పీట మీద ప్రపంచదేశాలన్నీ ప్రత్యక్షం అయ్యేవి. ఓ చపాతి ఆస్ట్రేలియా అయితే మరో చపాతి ఆఫ్రికా .... ఈ ఎదురుదెబ్బల అనుభవాలతో రాజన్ ఓ ఉపాయం కనిపెట్టాడు. ఆకారం ఎలాగ ఉన్నా కూడా ముందు ఓ పెద్ద సైజు చపాతీని తయారు చేసి, ఆ తర్వాత గుండ్రటి ఆకారం కోసం ఓ చిన్నసైజు గిన్నె తీసుకోని,చపాతీ మీద బోర్లించి సైడ్లు కట్టింగ్ చేయడం ప్రారంభించాడు..ఇంకేం జబర్దస్తయిన రౌండు చపాతీలు రెడీ.. ఈ మధ్యన ఓ "గెట్ టు గెదర్"కు ఇండియన్ స్పెషల్ అని "పప్పు,చపాతీలు" పట్టుకెళ్తే ,తిన్నవాళ్ళంతా బ్రేవ్,బ్రేవ్ అంటూ తెగ ఫిదా అయిపోయారు. ఇక అమెరికాకు చెందిన "లీసా" అనే ఐరాస స్వచ్చంద సేవిక అయితే తనకు చపాతీలను ఎలా తయారు చేస్తారో నేర్పాల్సిందేనని బైఠాయించింది. పట్టుబట్టి ఈ మధ్యే నా ప్రత్యక్ష పర్యవేక్షణలో చపాతీల తయారీలో "పట్టా" పుచ్చుకుంది. పట్టా పుచ్చుకున్న ఆనందం పట్టలేక "At last I learnt chapatis at Indian Palace" అని ఫేస్ బుక్ లో తన ఆనందాన్ని ప్రపంచంతో పంచుకుంది.
|
నేను చపాతీ తయారుచేయడం నేర్చుకున్నానోచ్! |
అందుకే..ఇన్ని రకాల అనుభవాలతో నాకు "గరిటధీరుల" పవర్ మీదా, నలభీమపాకం మీద గౌరవం పెరగడమే కాదు, కాస్తంతా "గర్వంగా"కూడా ఉంది. నేనొకటి అడుగుతాను,అసలూ ఆడవాళ్ళ గొప్పేమిటండీ? ఓ పదిమందికి వంట చేయమంటే చేస్తారు కానీ అదే ఓ వేయిమంది కి చేయమంటే గుడ్లు మిటకరించి, అసహాయంగా "మగధీరుల"వైపు బేలగా చూస్తారు..పెళ్ళైనా, రిసెప్షనైనా ఎక్కడ, ఏ పెద్ద ఫంక్షనైనా వండి,వార్చేవారెవరండీ? మన మగధీరులే కాదూ, భూతద్దం పట్టుకోని వెతికినా విందులో "ఆడవంట"కనపడుతుందా? ఇక్కడ విందు భోజనాలంటే మా మా ఆస్థాన వంటగాడు"ఎల్లయ్య"గురించి ఓసారి నొక్కి వక్కాణించాల్సిందే...ఆ చేతుల్లో ఏం మ్యాజిక్కు ఉందో ఏమో కాని, పెళ్ళీ,పేరంటం ఇలా ఏ విందు భోజనానికి వచ్చి ఓసారి "ఎంగిలి"పడి వెళ్ళిన వారు, నూటికి నూట ఇరవై శాతం తప్పనిసరిగా ఓ కామెంటు దానితో పాటు ఓ కాంప్లిమెంట్ ఇచ్చిపోవాల్సిందేనంటే నమ్మండీ.
అంచేతా ఆఖరుగా నేను చెప్పేదేమిటంటే " ఓ నలుడు, ఓ భీముడు, ఓ సాంబయ్య, మరో ఎల్లయ్య, అక్కడ హెగజీ, ఇక్కడ కబ్బా" వీరంతా అబ్బబ్బా అనిపించే కాకలుదీరిన గరిటవీరులు,మన మగధీరులు. అన్ని రంగాల్లో అగ్రగామిగా ఉన్న మనం(?) వంటింట్లొ మాత్రం ఆఖరుబెంచులో ఉంటే ఏలా? ఏది ఏమైనా కిచెన్ లో మన వెనుకబాటుపై పోరు చేయాల్సిందే, ఆడవాళ్ళను అదిగమించాల్సిందే...ఆడవాళ్ళముందు మనం లోకువ కావద్దంటే మగధీరులంతా "గరిటధారులు" కావాల్సిందే..ఓ సారి మన ఘనమైన " గరిట చరిత" తెలుసుకోని,తలుచుకోని అడుగు ముందుకు వేయండీ..గో అహెడ్ జయం మనదే..నలభీములకు జయహో! గరిటధారులకు జయ,జయహో!
{గమనిక: ఆడవాళ్ళకు మాత్రమే
ఈ పోస్టింగు మీ వంటింటి బరువును దించడానికి సరదాగా రాసింది మాత్రమే..ఇది మిమ్మల్ని నొప్పించడానికి కాదు, మెప్పించడానికి చేసిన ప్రయత్నం మాత్రమే అని గమనించగలరు}
|
WHO AM I ? this is our mission....enjoying like anything |