అందాల రాక్షసి
టైటిల్ చూసి ఈ మధ్యనే వచ్చిన సినిమారివ్యూ అని అనుకుంటున్నారా! అలాంటిదేమి కాదు.. నా మనుసును దోచేసిన ఓ అందమైన ద్వీపం గురించిన రివ్యూ..ఇక మొదలెట్టండి మరి.... తైమూరు కు వచ్చి దాదాపు ఆరు నెలలు అవుతున్నది, ఇన్ని రోజులుగా ఉంటున్నాను, ఈ దేశాన్ని ఓ లుక్కేయకపోతే బావుండదనిపించింది.అందుకే ఈ మధ్య తైమూరులో "మోస్ట్ పాపులర్ డెస్టినేషన్స్"ఓ రెండింటిని చుట్టేసివచ్చాను. మొదటగా చెప్పాల్సింది "ది బెస్ట్ " నే కాబట్టి దాని గురించే చెప్తాను. ఇది తైమూరు కు తూర్పున చిట్టచివరి దేశ భూభాగం, అత్యంత అందమైన " జాకో ద్వీపం" అందమంటే మామూలు అట్టాంటిట్టాంటి అందం కాదు, అన్నిరకాల కాలుష్యాలకు సుదూరంగా ఉన్న "సహాజ సిద్దమైన ప్రకృతి అందం", సృష్టికర్త మాంచి రొమాంటిక్ మూడ్ లోఉన్నప్పుడు నీలి రంగు నేపథ్యంలో గీసిన అందమైన చిత్రమది. మాకన్నా ముందుగా ఇక్కడ పని చేసి వెళ్ళిన మా సతీష్ మాటల్లో అయితే అది " భూలోక స్వర్గం". అప్పటినుండి ఎప్పుడెప్పుడా అని వెళ్ళడానికి నేను, మా ఉమామహేశ్వర్ రావు (హైదారాబాద్ ఇన్స్ పెక్టర్ గారు) స్కెచ్చులు వేస్తున్నాము. అదీగాక అద్భుత అందాలరాశి అయిన "జాకో" పుట్టినిల్లు అయిన "లాస్ పాలస్ జిల్లాలో" ఉన్న మా పోర్చుగీసు మిత్రులు ఎప్పుడెప్పుడోస్తారు అంటూ తొందరపెట్టేస్తున్నారు.
ఇక లాభం లేదని తిథి,నక్షత్రాలు, రాహుకాలాలు, వారాలు, వర్జ్యాలు చూసుకోని ( నిజమనుకోనేరు..జోకండీ బాబు) ఓ సుముహుర్తాన మా పంచకళ్యాణి "టయోట ప్రాడో" కారులో బయల్డేరాము. ఇక్కడో చిన్న ట్విస్టు... బయల్దేరుదామని సరుకు సరంజామా, మసాలా,పప్పు దినుసులు ఇలా అన్ని సర్దుకోని “పద పంచకళ్యాణీ” అంటే ఉలుకూ లేదు పలుకూ లేదు, హథవిధి! మొదటి అడుగులోనే మోసం వచ్చిందే, ఇక ముందు ముందు ఏం జరగునుందో అని గుండె " ఢబ ఢబ..ఢబ ఢబ" మని ఢబేలు మంది. ఏదైతేనేమి! అనుకున్నాము, అడుగు వెనక్కు పడరాదు అని డిసైడ్ అయిపోయి వెంటనే" గుర్రాన్ని" మార్చేశాము. ఇక జిందగీ లో మరిచిపోలేని మా అందాల యాత్ర మొదలయ్యింది. మాఅందాల మజిలీ "జాకో" నేను పని చేస్తున్న "అయిలు జిల్లా"కు దాదాపు 350 కిలోమీటర్ల దూరం ఉంటుంది, అంటే రానుపోను 700 కిలోమీటర్లన్నమాట. మా పాము మెలికల , మలుపుల రోడ్డును దాటి దేశ రాజధాని "దిలి" దాటాక (47 కిలోమీటర్ల దూరానికి 450 మలుపులు ఉన్నాయి మరి) ఈ దేశంలోనే " ది బెస్ట్" రోడ్డు పై న పడ్డాము. ఇక పంచకళ్యాణి ని పరుగులు పెట్టిస్తున్న నా ఆనందానికైతే పట్టపగ్గాలు లేవు, ఓ వైపు కేవలం వంద నుండి రెండోందల ఆడుగుల దూరంలో పరుచుకున్నట్లున్న " నీలి సముద్రం " మరో వైపు ఎంత పరుగు తీస్తావో తీయ్ అన్నట్లున్న నునుపైన రోడ్డు. ఆ రోడ్డును చూస్తే మాకైతే ఒక్కసారిగా కరువు జిల్లానుండి కోనసీమకు ట్రాన్స్ ఫర్ అయినట్లనిపించింది. అలా కాలి కింద కళ్యాణిని సుతారంగా తోక్కితే, సర్రున దూసుకెళ్తుంది, అయినా ఏంచేస్తాం మా కళ్యాణి కి "Speed Lock" ఒకటి ఏడ్చి చచ్చింది, స్పీడు ఎక్కువైతే చాలు "కుయ్యో,మొర్రో" అని అరిచేది, బుజ్జిముండ అలా ఎన్ని సార్లు అరిచిగీపెట్టిందో... ఓ రకంగా Speed Lock ఉండడం నయమే అనిపించింది. చుట్టూ ప్రకృతిని, సంగీతాన్ని,ముఖ్యంగా ప్రయాణాన్ని ఎంజాయ్ చేయగలిగాము. దాదాపుగా మా ప్రయాణం మొత్తం నీలి సముద్రం, నీలాకాశం రెండు పోటీ పడుతున్నట్లున్నాయి, కనుచూపుమేరా పైనా,కిందా పరుచుకోని ఉన్నాయి. ఇక సంగీతప్రియుడు అయిన మా "రావు"గారు ఓ పక్కనుండి " మేరి సప్నోంకి రాణి కబ్ అయేగితూ అని హిందీ నుంచి మొదలుకొని "మల్లి మల్లి ఇది రాని రోజు"అనే "చిరు" హిట్టు పాటల వరకు అలా మొబైల్ లో ప్లే చేస్తున్నాడు. ఇక చూసుకోండి మా ప్రయాణంలోని ఆ రసోద్వేగం, భావోద్వేగం.... వర్ణణాతీతం, ఆ ఆనందపు అలల సునామీ లో పక్కనున్న సముద్రంలో కొట్టుకపోయాము.
చిన్నప్పటినుండీ నాకు సముద్రం అంటే తెగ ఆరాధనాభావం, అంతులేని ఆ జలరాశి చుట్టూ ఎన్ని ఊహాలు అల్లుకున్నాయో, దానికి కారణం సముద్రానికి కడు దూరంగా ఉండటమే అనుకుంటాను...నాలుగవ తరగతిలో ఉండగా అనుకుంటా,మొదటిసారిగా మా తాత వెంబడి తీర్థయాత్రలలో భాగంగా మద్రాసులో సముద్రాన్ని చూశాను. ఆ కాలంలో టూరిస్ట్ బస్సువాళ్ళు తిరుపతి వెంకన్న దర్శనం తర్వాత ఖచ్చితంగా మద్రాసులో "సినిమా దేవుళ్ళ" దర్శనానికి తీసుకెళ్ళేవారు, అలా వారి పుణ్యాణ నాకు మొదటిసారిగా సముద్ర దర్శనం అయింది..ఇక అప్పటినుండీ కూడా ఇప్పటివరకు సముద్రం అంటే మనసులో అదో రకమైన పిచ్చి ప్రేమ ముదిరిపోయింది, అయినాకూడా ఇప్పటివరకు తనివితీరా సముద్రంతో ఊసులు చెప్పుకోలేదు...ఇదిగో ఇక్కడ సముద్రం పట్ల నాకున్న ఆపేక్ష చాలా వరకు తీరింది.
ఇక నా "కడలి కహానీ" పక్కన పెట్టి అసలు కహానీలోకి వద్దాం..అయిదు గంటల అలుపెరుగని మా ప్రయాణం తర్వాత రాజధాని"దిలి"తర్వాత రెండవ అతి పెద్ద పట్టణం(?)అయిన "బాకావు" కు చేరుకున్నాము.ఇది పోర్చ్ గీసు వారి ఏలుబడిలో రాజధానిగా ఉండింది, వారి ప్రభావం ఇప్పటికీ స్పష్టంగా కనపడుతుంటుంది.అక్కడ ఉత్తరభారతానికి చెందిన మన మిత్రులున్నారు, వారు కూడా మాలాగే ఐరాస పోలీసులే.. వారింట్లో సుష్టుగా భోజనం తర్వాత యాత్ర మళ్ళీ మొదలయ్యింది...సాయంత్రం అయిదు వరకు " లాస్ పాలస్" అనే ప్రాంతానికి చేరుకున్నాము. ఓ పోర్చుగీసు హోటళ్ళో దిగాము.. అదేంటో విచిత్రం, ఇక్కడ హోటళ్ళ బాత్రూంలలో బక్కెట్ లాంటివాటి పైన నిషేదం పెట్టినట్టున్నారు, కనపడితే ఒట్టూ! ఒకవేళ ఖర్మ కాలి అడిగినా మనని ఏదో గ్రహాంతరవాసిని చూసినట్లు చూస్తారు..ఆ చూపులవాడి,వేడీ తట్టుకోలేక అడ్జస్ట్ అయిపోయామనుకోండి.అయినా "తుడుచుకొనే సన్నాసులకు" బక్కెట్లతో ఏంపనండీ బాబు.. ఇక ఆ తర్వాత మా పోర్చ్ గీసు మిత్రుల గృహాన్ని పావనం చేశాము, వారి కోరిక మేరకు నలభీములము రంగంలోకి దిగి, ఇండియన్ స్పెషల్ "చికన్ కర్రీ, దాల్ తడ్కా"లను దడ దడలాడించాము, మన మసాలఘాటులను చల్లని బీరులతో శాంతింపచేసుకుంటూ "ఆహా! ఓహో!" అంటూ ఫుడ్డును ఫుల్లుగా ఎంజాయ్ చేసారు..మా పాత మిత్రులు డయానా,జార్జ్ లతో పాటు ఓ కొత్త జంట "హ్యూగో,రీటా"లు పరిచయం అయ్యారు...వాళ్ళిద్దరిని చూస్తే అచ్చుపోసిన, ఆదర్శవంతమైన భారతీయ జంటలాగా అనిపించారు, యూరోపియన్లలో అరుదుగా కనిపించే వారి అన్యోన్యతను చూసి తెగ ముచ్చటేసింది..ఎందుకలా అంటూన్నానంటే ఇక్కడికి వచ్చాక పాశ్చాత్య ప్రేమికుల మధ్య, భార్యాభర్తల మధ్య నున్న "మెటీరియలిజం"ను చాలానే చూశాము. ఇక భారతీయ, పాశ్చాత్యముచ్చట్లలో పడి పోయాము, అయినా మా"రావు"గారుంటే ముచ్చట్లకు కొదవే లేదు... ఆ విదేశీ ఔత్సాహికులకు యోగా, ఆయుర్వేదం, తాజ్మహాల్, చార్మినార్, పారడైస్ బిర్యానీ, పుల్లారెడ్డి మిఠాయిలు ఇలా మొత్తం భారతదేశాన్ని ముచ్చటగా మూడుగంటల్లో దర్శనం చేయించాడు, దాంతో ఇక లాభంలేదు ఇండియా ఓసారి రావాల్సిందేని వారు డిసైడ్ అయిపోయారు.
|
పోర్చుగీసు మిత్రులతో "విందు" భోజనం |
రాత్రి ముచ్చట్లతో కాస్తా ఆలస్యంగానే మంచమెక్కినా, ఉదయం ఠంచనుగానే "జాకో"కు బయల్దేరాము..దారి వెంట ఇళ్ళను,పొలాలను,మనుషులను గమనిస్తూ సరదాగా మా పయనం కంటిన్యూ చేశాము.. రోడ్డు వెంబడి అక్కడక్కడ మన ధాబాల్లాగ (అంత పెద్దవి కావులెండి) "రోడ్డు సైడు రెస్టారెంటులు" ఉన్నాయి..అన్నింట్లో కామన్ గా "చికెన్/చేప సీకులు(అదేనండీ కబాబులు)" కాలుస్తున్నారు..నేను పని చేస్తున్న "అయిలూ" ప్రాంతానికి , ఈ ప్రాంతానికి తేడా ఏమిటంటే ఇక్కడ పశువులనైనా, పందులనైనా స్వేఛ్ఛగా పొలాలమీదికి వదిలేశారు, అదే మా అయిలూ లోనైతే ఓ పొడవైన తాడుతో పశువును/పందిని ఓ గుంజకు కట్టేస్తారు,ఇక ఉదయం నుండీ సాయంత్రం వరకు ఆ తాడుపొడుగుతా, గుంజ చుట్టు తిరుగుతూ పొట్ట నింపుకోవాలి (బద్దకం వెధవలూ, పొద్దస్తమానం "పొగలు" పీల్చడం, వదడంలోనే "మహాబిజి").. కాని ఇక్కడ మాత్రం పశువులు,పందులు స్వేచ్చగా తిరుగుతున్నాయి. ఉన్నంతలో పబ్లిక్ కాస్తా రిచ్చుగా అనిపించారు, ఇల్ల్లు,వొల్లు ఒద్దికగా ఉన్నాయి..తైమూరు దేశంలో యాత్రీకుల "టాప్ డెస్టినేషన్" జాకో ద్వీపమే కావడం వలన రోడ్డును ఇప్పుడిప్పుడే బాగు చేస్తున్నారు, వర్షాకాలంలో మాత్రం ఈ రోడ్డు పై అడుగు వేయడం మహకష్టం.
|
హైలెస్సో! హైలెస్సా! |
ఆఖరికి మా మజిలికి అడుగుదూరంలోకి వచ్చేశాము..జాకో ద్వీపానికి ఇవతలి ఒడ్డున తువాతలు అనే బీచ్ ఉంది.. బీచుకు వంద అడుగుల లోపే ఓ రెండు హోటల్లు ఉన్నాయి, ఓ దాంట్లో మేము దూరాము..మామూలు రోజుల్లో అయితే ఒకరో,ఇద్దరో కనపడితే మహాగొప్పట..మేము వెళ్ళింది వారాంతంలో కావడంతో , ఫర్వాలేదు ఆ ప్రాంతం కాస్తా కళాకాంతులు సంతరించుకున్నది.. ఓ మరపడవ ఎక్కి "జాకో"కు బయల్దేరాము..ఇక ప్రకృతి అందాలు చూడాలి.. సముద్రం పూర్తి స్వఛ్ఛంగా అంటే "క్రిస్టల్ క్లియర్" అంటారే అలా కనపడుతున్నది, చుట్టూ నీలి రంగు నీరు, ఆవల ఒడ్డున పచ్చని చెట్లు కాలుష్యానికి కడు దూరంలో పోతపోసినట్లున్న సహజసిద్దమైన అందాల రాశి కాదు "అందాల రాక్షసి" ఆ జాకో ద్వీపం.ఒక్కసారి ఆ ద్వీపంపై అడుగు పడగాని నాలుగుపదుల కు అటూ,ఇటూ ఉన్న మేమిద్దరం పదిలోపుకెళ్ళిపోయాము, ఆ అద్భుత ప్రకృతి అందాలను చూసి పిచ్చ,పిచ్చగా గంతులేశాము,దూకాము,ఈదాము, పొర్లాము, బీచు వెంబడి పోటి పెట్టుకోనిమరీ జాగింగ్ చేశాము. కొద్దిగా ఇక్కడికి రావడం, ఉండడం కష్టమేగానీ ఏ క్రిష్ణవంశి లేదా ఏ పూరీ జగన్నాథో ఒక్కసారి ఇక్కడికి వస్తే డంగయిపోయి షూటింగ్ మొదలుపెట్టాల్సిందే...తనివితీరా సమద్రంలో ఈతేశాము,బోర్ అనిపిస్తే ఒడ్డున ఫారినర్ బిల్డప్ ఇస్తూ బోర్లా పడుకున్నాము, ఆ తర్వాత మళ్ళీ ఈత మొదలు..ఇలా మధ్యాహ్నాం నుండి సాయంత్రం వరకు ఫుల్లు బిజీగా గడిపేశాము..మధ్యలో మాతో పాటు ఓరెండు విదేశీ కుటుంబాలు కలిశాయి.ఒకరేమో బ్రెజిల్ మరోక ఫ్యామిలీ హోండూరస్..వాళ్ళ అమ్మాయిలిద్దరు పన్నెండు సంవత్సరాలవారే అయినా సముద్రం అడుగుకువెళ్ళి "స్టార్ ఫిష్"లను, పగడాలను పట్టుకొచ్చారు.. స్కూబా డైవింగ్ వీరులు, పగడాలు(corals), నత్తగుల్లల వేటగాళ్ళు, ఇలా ఉన్నంతలో సందడిగానే ఉండింది...కొందరికి భొజనం కావాలంటే పడవవాడు సముద్రంలో ఓ చేపను పట్టీ నిప్పుల మీద కాల్చి(Barbeque Fish) అసలుసిసలైన "సీ ఫుడ్డు" రుచి చూపించాడు..అప్పటికే మా సాపాటు అయిపోవడం, దానికితోడు మా"రావు"గారు భయం వ్యక్తం చేయడం వల్ల ఆ "రుచి"ని చూసే అదృష్టాన్ని మిస్సయ్యాము. అప్పటికే చీకటి పడుతుండడం, దానికితోడూ అలలహోరు ఎక్కువవడంతో అక్కడినుండి బయటపడ్డాము...
|
గుడారాల విడిది |
ఇక మా విడిదికి రాగానే మాకోసం మరో అనుభవం ఎదురుచూస్తున్నది..మేము అల్రేడి దూరిన గది ముందే బుక్కయిపోయిందట..హోటల్ వాడు “బుక్ చేసినవాళ్ళు” వస్తారో రారోనని ముందయితేమమ్మల్ని దూర్చాడు,ఇక ఇప్పుడు "వాళ్ళోచ్చారు" "ఖాళీ కరో" అని చేతులు పిసుక్కుంటున్నాడు..మేము ససేమిరా అనేవారమే, కాని ఆ బుక్ చేసినవారు మా మిత్రులే కావడంవల్ల మేము అడ్డంగా బుక్కయ్యాం.అలా అడ్డంగా బుక్కవ్వడం మరో రకంగా మంచిదయింది, మరో అందమైన అనుభవాన్ని మిగిలించింది. సముద్రానికి ఎదురుగా ప్లాస్టిక్ టెంటులు ఏర్పాటు చేశారు. ఆ రాత్రి ఆ "చిన్ని గుడారం"లోనే మా బస..రాత్రంతా వీనుల విందు చేస్తున్నట్లున్న ఆ సముద్రపు అలల హోరుకు మా ఆనందపు పరవళ్ళ జోరు తోడయితే ఇక "బోరు" అనేది ఉంటుందా? ఇక ఉదయం గుడారంనుండి లేవగానే అలలపైన తేలుతున్నట్లు కనపడిన సూర్యభగవానుడి దర్శనం..Simply Superb..అద్దిరిపోయింది..ఇక ఆ తర్వాత జీవితాంతం గుర్తుండిపోయే అనుభవాలను మేము తీసుకొని మా "అందాల రాక్షసి" జాకో కు వీడ్కోలు చెప్పి బయటపడ్డాము..ఓ పన్నెండు గంటల తర్వాత మా ఊరు "అయిలూ"కు చేరుకున్నాము..దారెంటా "రాక్షసి"గూర్చే ముచ్చట్లు, ఆ తర్వాత రెండు,మూడురోజులు కనపడ్డవాళ్ళకు కూడా "సేం టు సేం"..ఇప్పుడు మీతో పంచుకోవాలనిపించింది, చీప్ అండ్ బెస్ట్ లో మేము మాల్దీవులు, మారిషస్ లకు వెళ్ళొచ్చినట్లయింది, మీరు కూడా ఫ్రీగా ఈ జాకో అందాల రాక్షసి ఆనందపు అలలహోరులో కొట్టుకపొండీ....Enjoy like any thing
|
ఎవరీ బీచుబాబా? |
|
పోర్చుగీసు పోలీసు మిత్రుడితో నేను, ఉమారావ్ |
|
ఉషోదయపు పరిమళాలు |
|
జలకాలాటలలో....... |
|
Add caption |