25, సెప్టెంబర్ 2012, మంగళవారం

తైమూరు ముచ్చట్లు: అందాల రాక్షసి


అందాల రాక్షసి

                         టైటిల్ చూసి ఈ మధ్యనే వచ్చిన  సినిమారివ్యూ అని అనుకుంటున్నారా! అలాంటిదేమి కాదు.. నా మనుసును దోచేసిన ఓ అందమైన ద్వీపం గురించిన రివ్యూ..ఇక మొదలెట్టండి మరి....  తైమూరు కు వచ్చి దాదాపు ఆరు నెలలు అవుతున్నది, ఇన్ని రోజులుగా ఉంటున్నాను, ఈ దేశాన్ని ఓ లుక్కేయకపోతే బావుండదనిపించింది.అందుకే ఈ మధ్య తైమూరులో "మోస్ట్ పాపులర్ డెస్టినేషన్స్"ఓ రెండింటిని చుట్టేసివచ్చాను. మొదటగా చెప్పాల్సింది "ది బెస్ట్ " నే కాబట్టి దాని గురించే చెప్తాను. ఇది తైమూరు కు తూర్పున చిట్టచివరి దేశ భూభాగం, అత్యంత అందమైన " జాకో ద్వీపం" అందమంటే మామూలు అట్టాంటిట్టాంటి అందం కాదు, అన్నిరకాల కాలుష్యాలకు సుదూరంగా ఉన్న "సహాజ సిద్దమైన ప్రకృతి అందం", సృష్టికర్త మాంచి రొమాంటిక్ మూడ్ లోఉన్నప్పుడు నీలి రంగు నేపథ్యంలో గీసిన అందమైన చిత్రమది.  మాకన్నా ముందుగా ఇక్కడ పని చేసి వెళ్ళిన మా సతీష్ మాటల్లో అయితే అది " భూలోక స్వర్గం". అప్పటినుండి ఎప్పుడెప్పుడా అని వెళ్ళడానికి   నేను, మా ఉమామహేశ్వర్ రావు (హైదారాబాద్ ఇన్స్ పెక్టర్ గారు) స్కెచ్చులు వేస్తున్నాము.  అదీగాక అద్భుత అందాలరాశి అయిన "జాకో"  పుట్టినిల్లు అయిన "లాస్ పాలస్ జిల్లాలో" ఉన్న మా పోర్చుగీసు మిత్రులు ఎప్పుడెప్పుడోస్తారు అంటూ తొందరపెట్టేస్తున్నారు.  

                        ఇక లాభం లేదని తిథి,నక్షత్రాలు, రాహుకాలాలు, వారాలు, వర్జ్యాలు చూసుకోని ( నిజమనుకోనేరు..జోకండీ బాబు) ఓ సుముహుర్తాన మా పంచకళ్యాణి "టయోట ప్రాడో" కారులో బయల్డేరాము. ఇక్కడో చిన్న ట్విస్టు... బయల్దేరుదామని సరుకు సరంజామా, మసాలా,పప్పు దినుసులు ఇలా అన్ని సర్దుకోని “పద పంచకళ్యాణీ” అంటే ఉలుకూ లేదు పలుకూ లేదు, హథవిధి! మొదటి అడుగులోనే మోసం వచ్చిందే, ఇక ముందు ముందు ఏం జరగునుందో అని గుండె " ఢబ ఢబ..ఢబ ఢబ" మని ఢబేలు మంది. ఏదైతేనేమి! అనుకున్నాము, అడుగు వెనక్కు పడరాదు అని డిసైడ్ అయిపోయి వెంటనే" గుర్రాన్ని" మార్చేశాము. ఇక జిందగీ లో మరిచిపోలేని మా  అందాల యాత్ర మొదలయ్యింది. మాఅందాల మజిలీ "జాకో" నేను పని చేస్తున్న "అయిలు జిల్లా"కు దాదాపు 350 కిలోమీటర్ల దూరం ఉంటుంది, అంటే రానుపోను 700 కిలోమీటర్లన్నమాట. మా పాము మెలికల , మలుపుల రోడ్డును  దాటి దేశ రాజధాని "దిలి" దాటాక (47 కిలోమీటర్ల దూరానికి 450 మలుపులు ఉన్నాయి మరి) ఈ దేశంలోనే " ది బెస్ట్" రోడ్డు పై న పడ్డాము. ఇక పంచకళ్యాణి ని పరుగులు పెట్టిస్తున్న నా ఆనందానికైతే పట్టపగ్గాలు లేవు, ఓ వైపు కేవలం వంద నుండి రెండోందల ఆడుగుల దూరంలో పరుచుకున్నట్లున్న " నీలి సముద్రం " మరో వైపు ఎంత పరుగు తీస్తావో తీయ్ అన్నట్లున్న నునుపైన రోడ్డు. ఆ రోడ్డును చూస్తే మాకైతే ఒక్కసారిగా కరువు జిల్లానుండి కోనసీమకు ట్రాన్స్ ఫర్ అయినట్లనిపించింది. అలా కాలి కింద కళ్యాణిని సుతారంగా తోక్కితే, సర్రున దూసుకెళ్తుంది, అయినా ఏంచేస్తాం మా కళ్యాణి కి "Speed Lock" ఒకటి ఏడ్చి చచ్చింది, స్పీడు ఎక్కువైతే చాలు "కుయ్యో,మొర్రో" అని అరిచేది, బుజ్జిముండ అలా ఎన్ని సార్లు అరిచిగీపెట్టిందో... ఓ రకంగా Speed Lock ఉండడం నయమే అనిపించింది. చుట్టూ ప్రకృతిని, సంగీతాన్ని,ముఖ్యంగా ప్రయాణాన్ని ఎంజాయ్ చేయగలిగాము.  దాదాపుగా మా ప్రయాణం మొత్తం నీలి సముద్రం, నీలాకాశం రెండు పోటీ పడుతున్నట్లున్నాయి, కనుచూపుమేరా పైనా,కిందా పరుచుకోని ఉన్నాయి. ఇక సంగీతప్రియుడు  అయిన మా "రావు"గారు ఓ పక్కనుండి " మేరి సప్నోంకి రాణి కబ్ అయేగితూ అని హిందీ నుంచి మొదలుకొని "మల్లి మల్లి ఇది రాని రోజు"అనే "చిరు" హిట్టు పాటల వరకు  అలా మొబైల్ లో ప్లే చేస్తున్నాడు. ఇక చూసుకోండి మా  ప్రయాణంలోని ఆ రసోద్వేగం,  భావోద్వేగం.... వర్ణణాతీతం, ఆ ఆనందపు అలల సునామీ లో పక్కనున్న సముద్రంలో కొట్టుకపోయాము.

                                    చిన్నప్పటినుండీ నాకు సముద్రం అంటే తెగ ఆరాధనాభావం, అంతులేని ఆ జలరాశి చుట్టూ ఎన్ని ఊహాలు అల్లుకున్నాయో, దానికి కారణం సముద్రానికి కడు దూరంగా ఉండటమే అనుకుంటాను...నాలుగవ తరగతిలో ఉండగా అనుకుంటా,మొదటిసారిగా మా తాత వెంబడి తీర్థయాత్రలలో భాగంగా మద్రాసులో సముద్రాన్ని చూశాను. ఆ కాలంలో టూరిస్ట్ బస్సువాళ్ళు తిరుపతి వెంకన్న దర్శనం తర్వాత ఖచ్చితంగా మద్రాసులో "సినిమా దేవుళ్ళ" దర్శనానికి తీసుకెళ్ళేవారు, అలా వారి పుణ్యాణ నాకు మొదటిసారిగా సముద్ర దర్శనం అయింది..ఇక అప్పటినుండీ కూడా ఇప్పటివరకు సముద్రం అంటే మనసులో అదో రకమైన పిచ్చి ప్రేమ ముదిరిపోయింది, అయినాకూడా ఇప్పటివరకు తనివితీరా సముద్రంతో ఊసులు చెప్పుకోలేదు...ఇదిగో ఇక్కడ సముద్రం పట్ల నాకున్న ఆపేక్ష     చాలా వరకు తీరింది.

ఇక నా "కడలి కహానీ" పక్కన పెట్టి అసలు కహానీలోకి వద్దాం..అయిదు గంటల అలుపెరుగని మా ప్రయాణం తర్వాత రాజధాని"దిలి"తర్వాత రెండవ అతి పెద్ద పట్టణం(?)అయిన "బాకావు" కు చేరుకున్నాము.ఇది పోర్చ్ గీసు వారి ఏలుబడిలో రాజధానిగా ఉండింది, వారి ప్రభావం ఇప్పటికీ స్పష్టంగా కనపడుతుంటుంది.అక్కడ ఉత్తరభారతానికి చెందిన మన మిత్రులున్నారు, వారు  కూడా మాలాగే ఐరాస పోలీసులే.. వారింట్లో సుష్టుగా భోజనం తర్వాత యాత్ర మళ్ళీ మొదలయ్యింది...సాయంత్రం అయిదు వరకు " లాస్ పాలస్" అనే ప్రాంతానికి చేరుకున్నాము. ఓ పోర్చుగీసు హోటళ్ళో దిగాము.. అదేంటో విచిత్రం, ఇక్కడ హోటళ్ళ బాత్రూంలలో బక్కెట్ లాంటివాటి పైన నిషేదం పెట్టినట్టున్నారు, కనపడితే ఒట్టూ! ఒకవేళ ఖర్మ కాలి అడిగినా మనని ఏదో గ్రహాంతరవాసిని చూసినట్లు చూస్తారు..ఆ చూపులవాడి,వేడీ  తట్టుకోలేక అడ్జస్ట్ అయిపోయామనుకోండి.అయినా "తుడుచుకొనే సన్నాసులకు" బక్కెట్లతో ఏంపనండీ బాబు.. ఇక ఆ తర్వాత మా పోర్చ్ గీసు మిత్రుల గృహాన్ని పావనం చేశాము, వారి కోరిక మేరకు నలభీములము రంగంలోకి దిగి, ఇండియన్ స్పెషల్ "చికన్ కర్రీ, దాల్ తడ్కా"లను దడ దడలాడించాము, మన మసాలఘాటులను చల్లని బీరులతో శాంతింపచేసుకుంటూ "ఆహా! ఓహో!" అంటూ ఫుడ్డును ఫుల్లుగా  ఎంజాయ్ చేసారు..మా పాత మిత్రులు డయానా,జార్జ్ లతో పాటు ఓ కొత్త జంట "హ్యూగో,రీటా"లు పరిచయం అయ్యారు...వాళ్ళిద్దరిని చూస్తే అచ్చుపోసిన, ఆదర్శవంతమైన భారతీయ జంటలాగా అనిపించారు, యూరోపియన్లలో అరుదుగా కనిపించే వారి అన్యోన్యతను చూసి తెగ ముచ్చటేసింది..ఎందుకలా అంటూన్నానంటే ఇక్కడికి వచ్చాక పాశ్చాత్య ప్రేమికుల మధ్య, భార్యాభర్తల మధ్య నున్న "మెటీరియలిజం"ను చాలానే చూశాము. ఇక భారతీయ, పాశ్చాత్యముచ్చట్లలో పడి పోయాము, అయినా మా"రావు"గారుంటే ముచ్చట్లకు కొదవే లేదు... ఆ విదేశీ ఔత్సాహికులకు యోగా, ఆయుర్వేదం, తాజ్మహాల్, చార్మినార్, పారడైస్ బిర్యానీ, పుల్లారెడ్డి మిఠాయిలు ఇలా మొత్తం భారతదేశాన్ని ముచ్చటగా మూడుగంటల్లో దర్శనం చేయించాడు, దాంతో ఇక లాభంలేదు ఇండియా ఓసారి రావాల్సిందేని వారు డిసైడ్ అయిపోయారు.
పోర్చుగీసు మిత్రులతో "విందు" భోజనం


రాత్రి ముచ్చట్లతో కాస్తా ఆలస్యంగానే మంచమెక్కినా, ఉదయం ఠంచనుగానే "జాకో"కు బయల్దేరాము..దారి వెంట ఇళ్ళను,పొలాలను,మనుషులను గమనిస్తూ సరదాగా మా పయనం కంటిన్యూ చేశాము.. రోడ్డు వెంబడి అక్కడక్కడ మన ధాబాల్లాగ (అంత పెద్దవి కావులెండి) "రోడ్డు సైడు రెస్టారెంటులు" ఉన్నాయి..అన్నింట్లో కామన్ గా "చికెన్/చేప సీకులు(అదేనండీ కబాబులు)" కాలుస్తున్నారు..నేను పని చేస్తున్న "అయిలూ" ప్రాంతానికి , ఈ ప్రాంతానికి తేడా ఏమిటంటే ఇక్కడ పశువులనైనా, పందులనైనా స్వేఛ్ఛగా పొలాలమీదికి వదిలేశారు, అదే మా అయిలూ లోనైతే ఓ పొడవైన తాడుతో పశువును/పందిని ఓ గుంజకు కట్టేస్తారు,ఇక ఉదయం నుండీ సాయంత్రం వరకు ఆ తాడుపొడుగుతా, గుంజ చుట్టు తిరుగుతూ పొట్ట నింపుకోవాలి (బద్దకం వెధవలూ, పొద్దస్తమానం "పొగలు" పీల్చడం, వదడంలోనే "మహాబిజి").. కాని ఇక్కడ మాత్రం పశువులు,పందులు స్వేచ్చగా తిరుగుతున్నాయి. ఉన్నంతలో పబ్లిక్ కాస్తా రిచ్చుగా అనిపించారు, ఇల్ల్లు,వొల్లు ఒద్దికగా ఉన్నాయి..తైమూరు దేశంలో యాత్రీకుల "టాప్ డెస్టినేషన్" జాకో ద్వీపమే కావడం వలన రోడ్డును ఇప్పుడిప్పుడే బాగు చేస్తున్నారు, వర్షాకాలంలో మాత్రం ఈ రోడ్డు పై అడుగు వేయడం మహకష్టం.
హైలెస్సో! హైలెస్సా!
ఆఖరికి మా మజిలికి అడుగుదూరంలోకి వచ్చేశాము..జాకో ద్వీపానికి ఇవతలి ఒడ్డున తువాతలు అనే బీచ్ ఉంది.. బీచుకు వంద అడుగుల లోపే ఓ రెండు హోటల్లు ఉన్నాయి, ఓ దాంట్లో మేము దూరాము..మామూలు రోజుల్లో అయితే ఒకరో,ఇద్దరో కనపడితే మహాగొప్పట..మేము వెళ్ళింది వారాంతంలో కావడంతో , ఫర్వాలేదు ఆ ప్రాంతం కాస్తా కళాకాంతులు సంతరించుకున్నది.. ఓ మరపడవ ఎక్కి "జాకో"కు బయల్దేరాము..ఇక ప్రకృతి అందాలు చూడాలి.. సముద్రం పూర్తి స్వఛ్ఛంగా అంటే "క్రిస్టల్ క్లియర్" అంటారే అలా కనపడుతున్నది, చుట్టూ నీలి రంగు నీరు, ఆవల ఒడ్డున పచ్చని చెట్లు కాలుష్యానికి కడు దూరంలో పోతపోసినట్లున్న సహజసిద్దమైన అందాల రాశి కాదు "అందాల రాక్షసి" ఆ జాకో ద్వీపం.ఒక్కసారి ఆ ద్వీపంపై అడుగు పడగాని నాలుగుపదుల కు అటూ,ఇటూ ఉన్న మేమిద్దరం పదిలోపుకెళ్ళిపోయాము, ఆ అద్భుత ప్రకృతి అందాలను చూసి పిచ్చ,పిచ్చగా గంతులేశాము,దూకాము,ఈదాము, పొర్లాము, బీచు వెంబడి పోటి పెట్టుకోనిమరీ జాగింగ్ చేశాము. కొద్దిగా ఇక్కడికి రావడం, ఉండడం కష్టమేగానీ ఏ క్రిష్ణవంశి లేదా ఏ పూరీ జగన్నాథో ఒక్కసారి ఇక్కడికి వస్తే డంగయిపోయి షూటింగ్ మొదలుపెట్టాల్సిందే...తనివితీరా సమద్రంలో ఈతేశాము,బోర్ అనిపిస్తే ఒడ్డున ఫారినర్ బిల్డప్ ఇస్తూ బోర్లా పడుకున్నాము, ఆ తర్వాత మళ్ళీ ఈత మొదలు..ఇలా మధ్యాహ్నాం నుండి సాయంత్రం వరకు ఫుల్లు బిజీగా గడిపేశాము..మధ్యలో మాతో పాటు ఓరెండు విదేశీ కుటుంబాలు కలిశాయి.ఒకరేమో బ్రెజిల్ మరోక ఫ్యామిలీ హోండూరస్..వాళ్ళ అమ్మాయిలిద్దరు పన్నెండు సంవత్సరాలవారే అయినా సముద్రం అడుగుకువెళ్ళి "స్టార్ ఫిష్"లను, పగడాలను పట్టుకొచ్చారు.. స్కూబా డైవింగ్ వీరులు, పగడాలు(corals), నత్తగుల్లల వేటగాళ్ళు, ఇలా ఉన్నంతలో సందడిగానే ఉండింది...కొందరికి భొజనం కావాలంటే పడవవాడు సముద్రంలో ఓ చేపను పట్టీ నిప్పుల మీద కాల్చి(Barbeque Fish) అసలుసిసలైన "సీ ఫుడ్డు" రుచి చూపించాడు..అప్పటికే మా సాపాటు అయిపోవడం, దానికితోడు మా"రావు"గారు భయం వ్యక్తం చేయడం వల్ల ఆ "రుచి"ని చూసే అదృష్టాన్ని మిస్సయ్యాము. అప్పటికే చీకటి పడుతుండడం, దానికితోడూ అలలహోరు ఎక్కువవడంతో  అక్కడినుండి బయటపడ్డాము...

గుడారాల విడిది
ఇక మా విడిదికి రాగానే మాకోసం మరో అనుభవం ఎదురుచూస్తున్నది..మేము అల్రేడి దూరిన గది ముందే బుక్కయిపోయిందట..హోటల్ వాడు  “బుక్ చేసినవాళ్ళు” వస్తారో రారోనని ముందయితేమమ్మల్ని దూర్చాడు,ఇక ఇప్పుడు "వాళ్ళోచ్చారు" "ఖాళీ కరో" అని చేతులు పిసుక్కుంటున్నాడు..మేము ససేమిరా అనేవారమే, కాని ఆ బుక్ చేసినవారు మా మిత్రులే కావడంవల్ల మేము అడ్డంగా బుక్కయ్యాం.అలా అడ్డంగా బుక్కవ్వడం మరో రకంగా మంచిదయింది, మరో అందమైన అనుభవాన్ని మిగిలించింది. సముద్రానికి ఎదురుగా ప్లాస్టిక్ టెంటులు ఏర్పాటు చేశారు. ఆ రాత్రి ఆ "చిన్ని గుడారం"లోనే మా బస..రాత్రంతా వీనుల విందు చేస్తున్నట్లున్న ఆ సముద్రపు అలల హోరుకు  మా ఆనందపు పరవళ్ళ  జోరు తోడయితే ఇక "బోరు" అనేది ఉంటుందా? ఇక ఉదయం గుడారంనుండి లేవగానే అలలపైన తేలుతున్నట్లు కనపడిన సూర్యభగవానుడి దర్శనం..Simply Superb..అద్దిరిపోయింది..ఇక ఆ తర్వాత జీవితాంతం గుర్తుండిపోయే అనుభవాలను మేము తీసుకొని మా "అందాల రాక్షసి" జాకో కు వీడ్కోలు చెప్పి బయటపడ్డాము..ఓ పన్నెండు గంటల తర్వాత మా ఊరు "అయిలూ"కు చేరుకున్నాము..దారెంటా "రాక్షసి"గూర్చే ముచ్చట్లు, ఆ తర్వాత రెండు,మూడురోజులు కనపడ్డవాళ్ళకు కూడా "సేం టు సేం"..ఇప్పుడు మీతో పంచుకోవాలనిపించింది, చీప్ అండ్ బెస్ట్ లో మేము మాల్దీవులు, మారిషస్ లకు వెళ్ళొచ్చినట్లయింది, మీరు కూడా ఫ్రీగా ఈ జాకో అందాల రాక్షసి ఆనందపు అలలహోరులో కొట్టుకపొండీ....Enjoy like any thing


 




ఎవరీ బీచుబాబా?

పోర్చుగీసు పోలీసు మిత్రుడితో నేను, ఉమారావ్
ఉషోదయపు పరిమళాలు

జలకాలాటలలో.......
Add caption

11, ఆగస్టు 2012, శనివారం

తైమూరు ముచ్చట్లు: నలభీమపాకం

నోరూరిస్తున్న జవ్వాజి స్పెషల్

               
                                             అసలు భారతదేశంలో ఆడాళ్ళను వంటింటికి పరిమితం చేసి మన పూర్వీకులు పెద్ద తప్పు చేశారనే చెప్పాలి.దాంతో ఆడవారు "వంటింటి మహారాణుల్లా" వెలిగిపోతూ  వారికి నచ్చింది, తాము మెచ్చింది మన మోహాన వండి పడేస్తూ "సరి లేరు మాకెవ్వరూ" అని గరిటల విన్యాసం చేస్తున్నారు.కాని మన మగధీరులకు అవకాశం దొరకాలే కాని వంటింటిని కూడా ధడ ధడలాడించేయమని అంతర్జాలముఖంగా అందరికీ విన్నవిస్తున్నాను..ఒక్కసారి భూత,భవిష్యత్,వర్తమాన చరిత చూస్తే " పాకరంగాన" మనవాళ్ళకు ఎంత పట్టుందో తెలిసిపోతుంది.అలనాడు నలుడు, భీముడు మొదలుకొని, ఆడాళ్ళు కూడా అసూయ పడేలాగ "పాక ప్రావీణ్యాన్ని" ప్రదర్శిస్తున్న నేటి సంజీవ్ కపూర్ వరకు మన మగధీరులకు ఎదురులేదు..తేడా అల్లా మనము "అంగనల్లా"గా అవకాశం దొరికినప్పుడల్లా ఇలా చేసాము,అలా చేసాము అని "ప్రచారం" చేసుకోము, కిరీటాలు ధరించము..అసలు మాట వరుసకు కూడా "నలభీమ పాకం" అంటారే కాని, ఏ సావిత్రీ పాకమో, అనసూయ పాకమో అని ఎవరూ కూడా అనరు. ఈ ఘనచరితతోనే మగధీరుల "గరిట పవర్" పై గతంలో కొంత నమ్మకమున్నా కూడా ఈ తైమూరు వచ్చాక అది మరింత బలపడింది.


ఎంతవారలైనా....గరిటదాసులే
    ఇక అసలు విషయం ఏమిటంటే....ఐరాస శాంతి పరిరక్షణలో భాగంగా తైమూర్ వచ్చాక, వంటింటిని ప్రయోగవేదిక చేయడం "తప్పనిసరి"అయింది. గతంలో భాగ్యనగరంలో తలవని తలంపుగా, ఏమారుపాటునో, నా గ్రహపాటునో నా కాలు వంటింట్లో  పడిందా....ఆ వెంటనే నా భార్యామణి " వంటింట్లో ఆడాళ్ళలాగా మీకేం పని" అని గాండ్రించేది ( అదేదో నేను ఆమె సామ్రాజ్యాన్ని ఆక్రమించుకుంటున్నట్లు). కానీ ఇక్కడ " హమ్ ఆజాదీ హై"..అయినా ఇక్కడి హోటళ్ళూ, తిండీ మన వంటికి పడవు, అన్నిరకాల జంతుజాలాన్ని వండివార్చగల ఘనులు ఇక్కడి తైమూరీవాసులు. అదీగాక నేను ఉద్యోగం చేస్తున్నది ఓ అందమైన, ఏమీ అందుబాటులో లేని గ్రామీణ ప్రాంతంలో.. సో తప్పనిసరిగా నాకు ఓ చేతిలో "గన్ను" మరో చేతిలో "గరిట"తో సహావాసం చేయక తప్పడం లేదు. ఈ తప్పనిసరి తిప్పలు(నో..నో..అందమైన అనుభవాలు) నాకొక్కడికే కాదు, నాతోపాటు మిషన్ లో పని చేస్తున్న " చప్పన్నదేశాలకు"చెందిన "మగధీరులందరిదీ" ( మిషన్ లో పని చేస్తున్న ఆడపులుల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు, ఎందుకంటే ఏ దేశానికి చెందిన ఆడవారైనా ఈ రంగానా తామే నంబర్ వన్ అని తెగ ఫీల్ అవుతుంటారు).

గాంబియన్ మిత్రులు ఎన్సా,కబ్బా లతో బార్బెక్యూ చికెన్ తయారీ
తైమూరులో నా "గన్నూగరిటల సహాజీవనం" కంటే ముందూ "గరిట"తో నాకున్న అవినాభావ సంబంధాన్ని ఓసారి నెమరేయాల్సిందే.. ఇంటర్మీడియెట్ చదవడం కోసం నేనూ, నా బాల్యమిత్రుడు నర్సింగ్ జడ్చర్లలో మా మేనమామ "రవి"(ప్రస్తుతం ఐపియస్ అధికారి) రూంలో అడుగుపెట్టిన రోజులవి, అప్పటికే ఆయన "సీనియర్" అవడం వల్లా రూం బరువూ,భాద్యతల పంపకాలలో మావాడి చేతిలో "చీపురు" (శుభ్రత,పరిశుభ్రత) నా చేతికి "గరిట"(వంటావార్పు) అప్పచెప్పాడు.ఇక ఓవరాల్ సూపర్ విజన్,వీటో పవర్ మా "సీనియర్" చేతుల్లో ఉండేవన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా.... అలా "గరిట"తో పసికూన గా నా సావాసం మొదలైంది. అసలే వంటకు కొత్త, ఇక మా ప్రయోగాలతో మా వంటిల్లు  "భీభత్సంగా"ఉండేది(తొక్కలోది ఉన్నది ఒకే రూము, పైగా వంటిల్లు ఒకటి..అంత సీను లేదు కాబట్టి"సింగిల్ రూం" అనే చదువుకొనుమూ). దానికి తోడూ అప్పుడప్పుడూ మా నర్సింగ్  ప్రదర్శించే  "చేతివాటం"  ( వాడి బాధ వాడిది...తన పాకప్రావీణ్యాన్ని ప్రదర్శించి, సీనియర్ ను మెప్పించి ప్రమోషన్ కొట్టేయాలని).. వాడు "పోపు"(అదేనండీ  "తాళింపు") పెడితే చుట్టుపక్కలనున్న నాలుగిండ్లకు ఆ "ఘాటు" దెబ్బ తగిలేది, ఒక్కొసారి మా పక్కవాటా వాళ్ళు దగ్గుతూ,తుమ్ముతూ, నానా రకాలుగా ఆయాసపడుతూ మా "సింగిల్ రూంలో" ఏమైనా అగ్నిప్రమాదం సంభవించిందా అని పరుగెత్తుకుంటూ వచ్చేవారంటే నమ్మండీ..ఇక ఓసారి "రీల్" వేసుకోని చూడండి మావాడి "పోపు పొగలు" . ఇదే కాదండోయ్ మావాడికి మహా "దూరదృష్టి", చేసే "కర్రీ" రెండుపూటలా సరిపోవాలని, నేను ఏమరుపాటుగా ఉన్నది చూసి స్టవ్ మీద ఉడుకుతున్న కూరలో "ఠకీమని"  ఓ గ్లాసు నీళ్ళు పోసి ఏమీ తెలియనట్లు సైలంట్ గా ఉండేవాడు..వాడిని కంట్రోల్ చేయాలని నేనూ, మా సీనియర్ శతధా ప్రయత్నించినా ఎక్కువసార్లు వాడిదే"విజయం"..

అలా  మొదలైన నా "గరిట ప్రస్థానం" డిగ్రీ అయ్యేవరకి ఫర్వాలేదనిపించే స్థాయికి ఎదిగింది. తర్వాత "ఉస్మానియా"లో, ఆ తర్వాత "పోలీసు"లోకి చేరాకా "గరిట"కు తాత్కాలికంగా తలాక్ చెప్పాల్సివచ్చింది. అయితే గరిట విన్యాసాలకు దూరం అయినా కూడా " గరిటధారులను, పాక ప్రావీణ్యులను" ఓ కంట కనిపెడ్తూ, ప్రోత్సహిస్తుండేవాడిని.ఉస్మానియా యూనివర్సిటీ "ఏ"హస్టల్ మెస్ లో సాంబయ్య చేసే "సాంబారు"ను మా మిత్రబృందం "అహా! ఓహో!" అంటూ మెచ్చుకుంటుంటే బక్కపీచు సాంబయ్య ఛాతీ అమాంతం సిబియస్ బస్టాండంత విస్తారం అయ్యేది .  మేము విసిరే కాంప్లిమెంట్ల కోసం సాంబయ్య  అటూ, ఇటూ కాలు కాలిన పిల్లిలా  మా చుట్టూ రౌండ్ల మీద రౌండ్లు వేస్తుండేవాడు.దానికి తోడూ మేమేనాడు సాంబయ్యను  ఏ   కోశానా నిరాశపరచలేదు( ఎంతైనా సాటి గరిటవీరుడికి ఆ మాత్రం గౌరవం ఇవ్వకుంటే ఎలా?).
చపాతీ తయారీలో బిజీగా ఉన్న మా కమాండర్ సుధాకర్ ఉపాధ్యాయ
 ఇక ఇన్ని సంవత్సరాల "గరిట వియోగం" తప్పనిసరిపరిస్థితుల్లో తైమూరులో తీరిపోయింది. ఇక్కడ నేనూ, మా ఉమా మహేశ్వరరావు( హైదరాబాద్ ఇన్స్ పెక్టర్) తో కలిసి వంటింట్లో పట్టపగ్గాలు లేకుండా వీరంగం చేస్తున్నామనే చెప్పాలి. "వృత్తి"లో ఆయన నాకు సీనియర్ అయినా "ప్రవృత్తి"లో మాత్రం నేనే సీనియర్..సో, మామూలుగానే నేను "మెయిన్ ఛెఫ్"బాధ్యతలు స్వీకరించినప్పటికీ ఉమారావు అభివృద్దిని తక్కువ చేయడానికి వీలు లేదు. నేను తనతో జాయిన్ కాకముందు వంట రాక కొన్నిసార్లు పస్తులుండే పరిస్థితి పోయి ప్రస్తుతం అప్పుడప్పుడు "చప్పన్నదేశాల"కు చెందిన మిత్రులందరం కలిసి చేసుకునే ఫంక్షన్లకు "పప్పు" సప్లయి చేసే స్థాయికి ఎదిగిపోయాడు.మేమే కాదు, ఇక్కడ మాతో పాటు పని చేస్తున్న మగధీరులందరూ కాకలుదీరిన గరిటధారులే..ఈజిప్ట్ కు చెందిన బ్రిగేడియర్ హెగజీ చేసే "బట్టర్ రైస్" ముందు చేయి తిరిగిన ఆడపులులు చేసే ఏ వంట అయినా బలాదూరే..ఇక దానికి తోడూ గాంబియన్ మిత్రులు చేసే "బార్బెక్యూ చికెన్" ముక్క ఒక్కటి పంటి కింద పడిందా, నా సామిరంగా "ఇదిరా జీవితం" అని అనిపించకుంటే మీ మీద ఒట్టే. ఐరాస మిషన్ లో ఉన్న ఈ బలవంతపు ఎంజాయ్మెంట్ కు ఎవరూ అతీతులు కారు. ఈ మధ్య ఎన్నికల బందోబస్తుకు మా దగ్గరికి వచ్చిన మన ఇండియన్ కమాండర్ ఓ డిఐజీ గారు మా " ప్యాలెస్" లో చపాతీ పిండిని ఓ పట్టు పట్టి పోయారు.

నా పప్పు రెడీ!
  వంటింట్లో ప్రయోగాలు చేయడానికి ఇదీ పర్ఫెక్ట్ అయిన వేదిక..పప్పూ,సాంబారు,కుక్కగొడుగులు, అడ్డమైన ఆకుకూరలు వగైరాలను నానా రకాలుగా నేనూ, ఉమారావు ప్రయోగాలు చేస్తూనే ఉన్నాము. కొన్నిసార్లు సఫలం మరికొన్నిసార్లు అడ్దంగా విఫలం...అట్టర్ ఫ్లాప్ అయినా కూడా ఆత్మవిశ్వాసం కోల్పోని "థామస్ ఆల్వా ఎడిసన్"లాగా ఎప్పుడూ మా మీద , మా ప్రయోగాల మీద నమ్మకం కోల్పోకుండా " వహ్వా! వహ్వా! అహా!ఓహో!" అని ఒకరి భుజాలు మరోకరం చరుచుకుంటూ " గరిట ప్రస్థానం" కొనసాగిస్తున్నాము. మొదట్లో నేను,కెరళ మిత్రుడు "రాజన్" చపాతీలూ చేయడానికి సిద్దపడ్డప్పుడు నానా అనుభవాలు..అదేంటోగాని చపాతీ పీట మీద ప్రపంచదేశాలన్నీ ప్రత్యక్షం అయ్యేవి. ఓ చపాతి ఆస్ట్రేలియా అయితే మరో చపాతి ఆఫ్రికా .... ఈ ఎదురుదెబ్బల అనుభవాలతో రాజన్ ఓ ఉపాయం కనిపెట్టాడు. ఆకారం ఎలాగ ఉన్నా కూడా ముందు ఓ పెద్ద సైజు చపాతీని తయారు చేసి, ఆ తర్వాత గుండ్రటి ఆకారం కోసం ఓ చిన్నసైజు గిన్నె తీసుకోని,చపాతీ మీద బోర్లించి సైడ్లు కట్టింగ్ చేయడం ప్రారంభించాడు..ఇంకేం జబర్దస్తయిన రౌండు చపాతీలు రెడీ.. ఈ మధ్యన ఓ "గెట్ టు గెదర్"కు ఇండియన్ స్పెషల్ అని "పప్పు,చపాతీలు" పట్టుకెళ్తే ,తిన్నవాళ్ళంతా బ్రేవ్,బ్రేవ్ అంటూ తెగ ఫిదా అయిపోయారు. ఇక అమెరికాకు చెందిన "లీసా" అనే ఐరాస స్వచ్చంద సేవిక అయితే తనకు చపాతీలను ఎలా తయారు చేస్తారో నేర్పాల్సిందేనని బైఠాయించింది. పట్టుబట్టి ఈ మధ్యే నా ప్రత్యక్ష పర్యవేక్షణలో చపాతీల తయారీలో "పట్టా" పుచ్చుకుంది. పట్టా పుచ్చుకున్న ఆనందం పట్టలేక "At last I learnt chapatis at Indian Palace" అని ఫేస్ బుక్ లో తన ఆనందాన్ని ప్రపంచంతో పంచుకుంది.

నేను చపాతీ తయారుచేయడం నేర్చుకున్నానోచ్!
 అందుకే..ఇన్ని రకాల అనుభవాలతో నాకు "గరిటధీరుల" పవర్ మీదా, నలభీమపాకం మీద గౌరవం పెరగడమే కాదు, కాస్తంతా "గర్వంగా"కూడా ఉంది. నేనొకటి అడుగుతాను,అసలూ ఆడవాళ్ళ గొప్పేమిటండీ? ఓ పదిమందికి వంట చేయమంటే చేస్తారు కానీ అదే ఓ వేయిమంది కి చేయమంటే గుడ్లు మిటకరించి, అసహాయంగా "మగధీరుల"వైపు బేలగా చూస్తారు..పెళ్ళైనా, రిసెప్షనైనా ఎక్కడ, ఏ పెద్ద ఫంక్షనైనా వండి,వార్చేవారెవరండీ? మన మగధీరులే కాదూ, భూతద్దం పట్టుకోని వెతికినా విందులో "ఆడవంట"కనపడుతుందా? ఇక్కడ  విందు భోజనాలంటే మా  మా ఆస్థాన వంటగాడు"ఎల్లయ్య"గురించి ఓసారి నొక్కి వక్కాణించాల్సిందే...ఆ చేతుల్లో ఏం మ్యాజిక్కు ఉందో ఏమో కాని, పెళ్ళీ,పేరంటం ఇలా ఏ విందు భోజనానికి వచ్చి ఓసారి "ఎంగిలి"పడి వెళ్ళిన వారు, నూటికి నూట ఇరవై శాతం తప్పనిసరిగా ఓ కామెంటు దానితో పాటు ఓ కాంప్లిమెంట్  ఇచ్చిపోవాల్సిందేనంటే నమ్మండీ.

అంచేతా ఆఖరుగా నేను చెప్పేదేమిటంటే " ఓ నలుడు, ఓ భీముడు, ఓ సాంబయ్య, మరో ఎల్లయ్య, అక్కడ హెగజీ,  ఇక్కడ  కబ్బా" వీరంతా అబ్బబ్బా అనిపించే కాకలుదీరిన గరిటవీరులు,మన మగధీరులు. అన్ని రంగాల్లో అగ్రగామిగా ఉన్న మనం(?) వంటింట్లొ మాత్రం ఆఖరుబెంచులో ఉంటే ఏలా? ఏది ఏమైనా కిచెన్ లో మన వెనుకబాటుపై పోరు చేయాల్సిందే, ఆడవాళ్ళను అదిగమించాల్సిందే...ఆడవాళ్ళముందు మనం లోకువ కావద్దంటే మగధీరులంతా "గరిటధారులు" కావాల్సిందే..ఓ సారి మన ఘనమైన " గరిట చరిత" తెలుసుకోని,తలుచుకోని అడుగు ముందుకు వేయండీ..గో అహెడ్ జయం మనదే..నలభీములకు జయహో! గరిటధారులకు జయ,జయహో!

{గమనిక: ఆడవాళ్ళకు మాత్రమే

                 ఈ పోస్టింగు మీ వంటింటి బరువును దించడానికి సరదాగా రాసింది మాత్రమే..ఇది మిమ్మల్ని నొప్పించడానికి కాదు, మెప్పించడానికి చేసిన ప్రయత్నం మాత్రమే అని గమనించగలరు}
WHO AM I ? this is our mission....enjoying like anything

29, జులై 2012, ఆదివారం

తైమూరు ముచ్చట్లు: అనగనగా ఓ మొసలి.....



        అమ్మో మొసలి... సాధారణంగా మొసలి పేరు వింటేనే జనాభాలో ముప్పాతిక శాతానికి మలేరియా జ్వరం వచ్చినట్లు గజగజ వణికిపోతారు.నాకైతే ఆ పేరు వింటే వణుకుడుతో  పాటు ఠంచనుగా ఐమాక్స్ లో రెండు కథలు గుర్తుకు వస్తాయి.మొదటిది గజేంద్రోపాఖ్యానం లోనిది, భూలోకంలోని ఓ కొలనులో మొసలి బారిన చిక్కుకున్న తన భక్తుడైన గజేంద్రుడిని రక్షించడం కోసం శ్రీ మహావిష్ణువు పడకమందిరం నుండే యెకాయెకిన  పరుగు పరుగున బయల్దేరి వెళ్ళి,తన చక్రాయుధంతో మొసలిని సంహారించడం.ఇక రెండవది పంచతంత్రంలోనిది, ఆశగొండి మరియు ఆకలిగొండి అయిన తన ముద్దులభార్య పేరాకలి తీర్చడంకోసం తన స్నేహితుడైన కోతి గుండెకాయకే ఎసరు పెట్టాలని బయల్దేరి... తెలివైన తన కోతిమిత్రుడి చేతిలో భంగపాటుకు గురైన ఓ మందమతి మొసలి కథ. మనందరము మొసలి అంటేనే మొహం చిట్లిస్తాము, పైగా దాన్ని గబ్బర్ సింగ్ ను చూసినట్లు చూస్తాము( అంటే లేటెస్ట్ గబ్బర్ పవన్ కళ్యాణ్ కాదు,..పురానా గబ్బర్.. అంటే విలన్  అని నా ఉవాచ).పైగా  ఎవరైనా రాజకీయనాయకులు తన ప్రజానీకం కష్టాలను చూసి తట్టుకోలేక కన్నీరు ఒలికిస్తే " మొసలి కన్నీరు కారుస్తున్నారని" ఎకసెక్కాలు ఆడుతాము.

కానీ తైమూరు ప్రజలకు అలా కాదు, మొసలి అంటే వారి దృష్టిలో సాక్షాత్తు శ్రీమన్నారయణ అవతారం( సారీ..ఫ్లో లో అలా వెళ్ళిపోయింది, నిజానికి నారాయణుడితో వీరికేమి సంబంధం లేదు..ఐ మీన్ దైవంతో సమానమని)..ఇక మొసలి కంట కన్నీరు ఒలికిందా దేశానికి అరిష్టం, అందరికి పోయే కాలం  ముంచుకొచ్చిందనే ఘాఠ్ఠిగా అనుకుంటారు.ఈ దేశంలో మొసళ్ళను పట్టడం, వేటాడడం, చంపడం లాంటి మొసళ్ళ హానికర చర్యలు పూర్తి గా నిషిద్దం...ఒకవేళ మొసలి ఎవరిపైన దాడి చేసినా కూడా, అయ్యోపాపం అని దాడికి గురైనవాడిపై కాస్తా కనికరం కూడా చూపించరు, పైగా వీడేదో మహాపాపానికి ఒడిగట్టాడు అందుకే "మొసలి దేవుడు"శిక్షించాడని దాడిని సమర్థిస్తారు.  అన్ని రకాల పాకే,వాకే,ఎగిరే,ఈదే జీవులను బ్రేవ్ మని భోంచేసే తైమూర్ సోదరులు మొసలికి మాత్రం మినహాయింపు ఇచ్చారు..మొసళ్ళ భక్షణ కాదు సంరక్షణే మా ధ్యేయం అంటారు. తైమూరు ప్రజల "మొసలి ప్రేమను" చూసి ప్రముఖ మొసళ్ళ వేటగాడు  స్టీవ్ ఇర్వీన్ తెగ సంబరపడిపోయేవాడట( పాపం అంత పెద్ద మోనగాడు కూడా స్టింగరీ అనే ఓ బుల్లి చేప దెబ్బకు బలైపోయాడు, సప్త సముద్రాలు దాటి వచ్చి మురికికాల్వలో పడి చావడం అంటే ఇదేనేమో.... ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరూ...)మొసళ్ళ సంరక్షణకు ఓ టాస్క్ ఫోర్స్ ఏర్పాటుకు, ఇతర సలహాలు, సూచనలు తెగ ఇచ్చేసి వెళ్ళిపోయాడు. వీళ్ళ మొసళ్ళ ప్రేమ ఎంతవరకు వెళ్ళిందంటే, జనాభాలో 60 శాతం మంది మగవాళ్ళ హెయిర్ స్టైల్,ముఖ్యంగా యూత్ అయితే దాదాపు 80 శాతం మంది తల మీది బొచ్చును కూడా మొసలి ని గుర్తుకు తెచ్చేలా కట్ చేయిస్తారు.అసలు మొసళ్ళ పట్ల ఇంత అవ్యాజ్యమైన ప్రేమ ఎందుకు చెప్మా అంటే, అసలు తమ అస్థిత్వానికి మూల పురుషుడు మొసలే అంటారు, తమదంతా "మొసలి వంశమని" కాలరెగిరేస్తారు. తైమూరు ప్రజలకు, మొసలికి ఉన్న అవినాభావ సంబంధం గూర్చి వాడుకలో ఓ జానపదం ప్రచారంలో ఉన్నది. దాని ప్రకారం.....

అనగనగా ఓ చిన్న కొలను, అందులో ఓ బుజ్జి మొసలి ఉండేది. చూడ్డానికి బుజ్జిదే అయినా బుర్రంతా బడా ఆలోచనలు, హైస్కూల్ పోరగాడు ఐఏయస్ కావాలని కలలు కన్నట్లు మన బుజ్జిమొసలికి కూడా ఆ కొలనునుండి త్వరాగా బయటపడి, సముద్రంలో తన ప్రతాపం చూయించాలని తెగ ఆరాటపడేది.ఇంతలో ఆ ప్రాంతంలో తీవ్రమైన దుర్భిక్షపరిస్థితులు ఏర్పడ్డాయి,కొలనులో నీళ్ళు అడుగంటిపోసాగాయి.ఇక అక్కడుంటే తనకు నూకలు చెల్లినట్లేనని భావించిన బుజ్జి మొసలి, ఎలాగు సముద్రం చేరాలనే తన ఆశయం కూడా నెరవేరినట్లవుతుంది అని సముద్రం వైపు వెంటనే ప్రయాణం మొదలు పెట్టింది. ఎంత ప్రయాణం చేసినా సముద్రం అంతూ పొంతూ దొరకడంలేదు, ఓ వైపు మల మాడిస్తున్న సూర్య ప్రతాపం మరో వైపు అల్లల్లాడిస్తున్న ఆకలి ప్రతాపం, ఇక తన పని అయిపొయినట్లేనని బుజ్జి మొసలి ఢీలా పడిపోయింది.ఇంతలోఅటుగా వెళ్తున్న ఓ చిన్నారి బాలుడు బుజ్జి మొసలి బాధను చూసి దాన్ని తన చేతుల్లోకి తీసుకొని వడి వడిగా సముద్రాన్ని చేరుకొని,నీళ్ళల్లో వదిలాడు.ఒక్కసారి నీళ్ళల్లో పడగానే వెయ్యేనుగుల బలం వచ్చినట్లయింది,తనకు ప్రాణభిక్ష పెట్టిన చిన్నారిని మిత్రుడిగా, సోదరుడిగా బుజ్జి మొసలి భావించి, ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఒడ్డుకు వచ్చి తనను పిలవమని చెప్పి సముద్రంలోకి వెళ్ళి పోయింది.


కొంత కాలం గడిచింది...ఓ రోజు బాలుడు సముద్రం ఒడ్డుకు వచ్చి మొసలి సొదరుడిని పిలిచాడు, వెంటనే మొసలి వచ్చింది. మొసలితో బాలుడు" సోదరా నాకు ప్రపంచం చుట్టి రావాలని ఉంది" అని అన్నాడు."ఒస్ అదెంత పని నీవు నా వీపు మీద కూర్చో, నేనంతా చూపిస్తాను" అని మొసలి అని బాలుడిని తన వీపుపైన కూర్ఛొపెట్టుకొని సముద్రప్రయాణం ప్రారంభించింది. ప్రయాణంలో కొన్ని రోజులు గడిచాకా మొసలికి బాలుడిని తినాలన్న కోరిక కలిగింది, కాని ఓ వైపు మనస్కరించక సముద్రంలోని చేపలను, తాబేళ్ళను ఇతర అన్ని జీవులను సలహా అడిగింది..ఎవరిని అడిగినా కూడా " సహాయం చేసిన వాడికి హాని తలపెట్టడం మహాపాపం" అనే చెప్పాయి...అయినా కూడా బాలుడిని కరకర నమిలేయాలనే ఆలోచనతో ఏ ఒక్కరైనా తనను సపోర్ట్ చేయకపోతారా అని కనపడ్డ జీవినల్లా సలహా అడిగింది..కాని ఎవరినుండి కూడా తప్పుడు సలహా రాలేదు..మొసలి ఆలోచనలో పడింది" నిజమే కదా నాకు ప్రాణభిక్ష పెట్టిన సోదరుడిని మట్టుబెట్టాలనుకోవడం ఎంత పాపం" అని తీవ్రంగా ఆవేదన చెందింది. పశ్చాతాపంతో దహించుకుంటూ బాలుడితో " సోదరా నన్ను కాపాడిన నిన్నే కడతేర్చాలని అనుకున్నాను, నా వల్ల ఘోర అపరాధం జరిగింది.ఇప్పుడు నేను ప్రాయశ్చిత్తం చేసుకుంటాను...నేను చనిపోతాను, నా శరీరంపైన నీవు నివసించి నీ వంశాన్ని అభివృద్ది చేయి" అని తైమూరు తీరానికి వచ్చి మొసలి ప్రాణం వదిలింది.ప్రాణం వదిలిన మొసలి పెరిగి, పెరిగి పెద్ద భూభాగంగా ఏర్పడింది,దాని వొంటి మీదనున్న పొలుసులు పెద్ద పెద్ద పర్వతాలు గా ఏర్పడ్డాయి. మొసలి సోదరుడి కోరిక మేరకు బాలుడు పెరిగి పెద్దవాడై పిల్లా,జెల్లతో వంశాన్ని అభివృద్ది చేసాడు..ఆ వంశాంకురాలే నేటి తైమూరు ప్రజలు. ఈ జానపదం నిజమైనదని తైమూరు ప్రజలు బలంగా విశ్వసిస్తారు.అంతగా అనుమానం ఉంటే ఓ సారి తైమూర్ మ్యాప్ ను తెరిచి చూడమంటారు.
నిజమే కావాలంటే తైమూర్ చిత్రం చూడండి  అచ్చుగుద్దినట్లు మొసలి ముఖంలాగా అనిపించడంలేదూ..అన్నట్లు తైమూర్ ప్రజలు సముద్రంలోకి దిగేప్పుడు "ఓ లఫాయి ( అంటే టెటున్ భాషలో మొసలి అని అర్థం) మేము నీ వంశస్తులము, మాకు హాని తలపెట్టకు" అని దూకుతారట. అలా ప్రార్థించి దిగితే తమ తాతలూ,ముత్తాతలు అయిన మొసళ్ళు ఏమి చేయవని వీరి ధీమా!అయితే ఈ కథంతా చదివి మీరూ ఓ ట్రయల్ వేయకండోయ్, ఈ మినహాయింపు కేవలం తైమూరువాసులకే, మీరు దిగారో కరకరకరకరకరకరకరకరే.... ఇదండీ బాబూ తైమూరు ప్రజల “మొసలి ప్రేమ” వెనక ఉన్న అసలు కహానీ. వచ్చేవారం మరో కహానీ చెప్పుకుందాము, అంతవరకు సెలవు మరి...

20, జులై 2012, శుక్రవారం

మిఠాయి పొట్లం: తైమూరు ముచ్చట్లు: పాత ప్రధాని నేతృత్వంలో కొలువుదీర...

మిఠాయి పొట్లం: తైమూరు ముచ్చట్లు: పాత ప్రధాని నేతృత్వంలో కొలువుదీర...: ఈ నెల మొదటి వారంలో పార్లమెంటు ఎన్నికలు జరుపుకున్న తూర్పు తైమూర్ దేశం కొత్త స...

తైమూరు ముచ్చట్లు: పాత ప్రధాని నేతృత్వంలో కొలువుదీరనున్న కొత్త ప్రభుత్వం





ఈ నెల మొదటి వారంలో పార్లమెంటు ఎన్నికలు జరుపుకున్న తూర్పు తైమూర్ దేశం కొత్త సంకీర్ణప్రభుత్వం ఆధ్వర్యంలో తన భవిష్యత్తును నిర్మించుకోనున్నది. పది సంవత్సరాల క్రితం విదేశీ ఇండోనేషియా నియంతృత్వ పాలన నుండి విముక్తి చెంది, ఇన్నాళ్ళూ ఐక్యరాజ్య సమితి చిటికెనవేలు పట్టుకోని నడిచిన తైమూరు ఇక స్వయంగా తన పయనం కొనసాగించనుంది. నాలుగు వందల సంవత్సరాల పోర్చుగీసు వలస పాలన నుండి, ఆ తర్వాత పాతిక సంవత్సరాల ఇండోనేషియా నియంతృత్వ పాలన నుండి బయట పడడానికి తైమూరు ప్రజలు ఎన్నో త్యాగాలు చేసారు, దాదాపు దేశ జనాభాలో మూడవవంతు       (సుమారు మూడులక్షల మంది) బలి  పీఠం ఎక్కిన తర్వాతగాని స్వాతంత్ర్యానికి నోచుకోలేదు. బంగారు పిచ్చుక లాంటి భారతదేశాన్ని కూడ పీల్చిపిప్పి చేసిన విదేశీ వలసపాలన చిన్న ద్వీప దేశమైన తైమూరుకు ఎలాంటి మినహాయింపు ఇవ్వలేదు. తత్ఫలితం ప్రపంచంలో మానవ అభివృద్ది నివేదిక ప్రకారం 146 వ స్థానం. పేరుకు 12 లక్షల జనాభా కలిగిన చిన్న దేశమే కాని కళ్ళ ముందు సవాలక్ష సమస్యలు దర్శనమిస్తున్నాయి. పేదరికం, నిరక్షరాస్యత, మౌలిక వసతుల కొరత, ఆందోళన పరుస్తున్న ప్రజల ఆరోగ్యం, ఇంకా  వంటబట్టని ప్రజాస్వామ్య స్పూర్తి ... ఇవన్ని కొత్త ప్రభుత్వం ముందున్న ముఖ్యమైన సవాళ్ళు.

 దామాషా ప్రాతినిథ్యం పద్దతి ప్రకారం ఎన్నికలు జరుపుకున్న ఈ దేశ పార్లమెంటు లో మొత్తం 65 సీట్లు ఉన్నాయి. ఎన్నికలలో పార్టీలు సాధించిన ఓట్లను బట్టి సీట్లు కేటాయిస్తారు.  సార్వజనిన వయోజన ఓటింగును అవలంభిస్తున్న ఇక్కడ 17 సంవత్సరాలు దాటిన వయోజనులకు ఓటు హక్కు కల్పించారు.ప్రశాంత వాతావరణంలో, అంతర్జాతీయపర్యవేక్షణలో జరిగిన ఎన్నికలలో మొత్తం 6,47,814 మంది ఓటర్లు  21 పార్టీలకు ఓటు వేశారు. కాసుల పంపకాలు, మందు చుక్కలు, మైకుల హోరు, ఫ్లెక్సీల జోరు, విందు భోజనాల హంగామా, హాడావిడి లేని ఎన్నికలివి, ఒక దశలో నాకే అనుమానం వచ్చింది.." అసలు నిజంగానే  ఎన్నికలు జరుగుతున్నాయాని". పోలింగ్ రోజు డ్యూటీ కి వెళ్ళడంతో సందేహాం తీరిపోయింది. మనలాగా ఎలక్ట్రానిక్ ఓటింగు యంత్రాలు లేవిక్కడ..సాంప్రదాయపద్దతిలో 21 పార్టీల గుర్తులున్న బ్యాలెట్ పేపరు వాడారు. అయితే నవ్వోచ్చే విషయం ఏమిటంటే ఓటర్లు బ్యాలెట్ పేపర్ పై  తమకు నచ్చిన, మెచ్చిన పార్టీ గుర్తుపై మేకుతో బొక్క పొడిచి, బాక్సులో వేస్తారు. ఆ తర్వాత మూడుగంటలనుండి అదే సెంటరు లో ప్రారంభం అయ్యే కౌంటింగ్ లో ప్రిసైండింగ్ అధికారి బహిరంగంగా ఒక్కో బ్యాలెట్ పేపర్ ను బయటికి తీసి, ఓక్కొ బొక్కను లెక్కపెడుతు, బోర్డుపై పార్టీలు సాధించిన బొక్కల లెక్కలు రాస్తాడు.తర్వాత బ్యాలెట్ బాక్సులన్నీ దేశరాజధానికి చేరుకుంటాయి..అక్కడ ట్యాబులేషన్ పని  జరుగుతుంది. తైమూరు రాజ్యాంగం ప్రకారం ఎన్నికలు జరిగిన 12 రోజులకు ఎన్నికల ఫలితాలు అధికారికంగా ప్రకటించాలి.


ప్రస్తుత ప్రధాని జనానా గుసామా
ఈ ఎన్నికలలో 21 పార్టీలు పాల్గొన్నాకూడ కేవలం నాలుగు పార్టీలు మాత్రమే సీట్లు సాధించే ఓట్లు సంపాదించుకున్నాయి. ప్రస్తుత ప్రధాని జనాన గుసామా నేతృత్వంలోని CNRT పార్టీ అధికంగా ౩౦ సీట్లు సంపాదించంగా, స్వాతంత్రపోరాటంలో అగ్రగామి గా నిలిచిన FRETLIN పార్టీ 25సీట్లు, మాజీ అధ్యక్షుడు, నోబెల్ బహుమతి గ్రహీత అయిన రామోస్ హోర్తా మద్దతుగల PD పార్టీ 8 సీట్లు, మరో చిన్న పార్టీ 2 సీట్లు సంపాదించుకున్నాయి. మన కాంగ్రేస్ పార్టీ లాగా స్వాతంత్ర్య ఉద్యమంలో ముందునిలిచిన FRETLIN పార్టీకి ఈసారి కూడా తీవ్ర నిరాశ ఎదురయ్యింది.ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 65 సీట్ల పార్లమెంట్ లో 33 సీట్లు ఉండాలి, ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యత లేనందున సంకీర్ణ ప్రభ్హుత్వ ఏర్పాటు తప్పనిసరి అయింది. FRETLIN పార్టీ మీనమేషాలు లెక్కపెడుతుండగానే, ప్రధాని జనానా నేతృత్వంలోని CNRT పార్టీ ఇతర రెండు పార్టీలతో కలిసి, సంకీర్ణం ఏర్పాటుకు రంగం సిద్దం చేసింది. సైన్యంలో అత్యధికంగా మద్దతు గల FRETLIN పార్టీ నిరసన దేశంలో ఆందోళనలకు,అల్లర్లకు దారి తీసింది. ప్రస్తుతానికి తాత్కలికంగా అల్లర్లు ఆగినా, ఎప్పుడైనా తిరిగి చెలరేగడానికి అవకాశం ఉంది.దేశంలో శాంతి భద్రతల పర్యవేక్షణ చేస్తున్న 1300 వందల మంది ఐరాస శాంతి పరిరక్షక బృందం (అంటే మేము), కొత్త ప్రభుత్వానికి బరువు, బాధ్యతలు అప్పగించి ఈ సంవత్సరాంతానికి ఇక్కడి నుండి బయటపడడానికి  రంగం సిద్దం అవుతున్నది. ఐరాస శాంతి పరిరక్షక బృందం వెళ్ళిపోయిన తర్వాత అసలు సవాలు ప్రారంభం అవుతది, పరిణితి చెందని ప్రజాస్వామ్యం, సైన్యం పొషించనున్న పాత్ర అనేవిక్కడ రెండు కీలకమైన అంశాలు, ఏమాత్రం తేడా వచ్చినా కథ మళ్ళీ మొదటికే వస్తుంది.


మాజీ అధ్యక్షుడు, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత రామోస్ హోర్తా
అంతగా వ్యవసాయయోగ్యంగా లేని ఈ దేశం ప్రధానంగా దేశ సముద్ర జలాల్లో విస్తారంగా ఉన్న చమురు నిల్వల పైనే ఆధారపడుతున్నది, దేశ బడ్జెట్లో సుమారు 90 శాతం ఆదాయాన్ని చమురు రంగం భర్తీ చేస్తున్నది. ఈ ఆదాయాన్ని ప్రధానంగా దేశాభివృద్దికి వినియోగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది, ఇండోనేషియా వెళ్తూ, వెళ్తూ అంతంత మాత్రమే ఉన్న మౌలిక వసతులను సర్వనాశనం చేసి వెళ్ళింది. ముఖ్యంగా ఈ దేశ రహాదారులు అక్షరాలా నరకానికి నకళ్ళు అని చెప్పవచ్చు. కొండలూ, గుట్టలు లతో కూడిన పాము మెలికల రోడ్లు, విరిగిపడే కొండ చరియలు, జర్రున జార్చుకొనే లోయలు...అబ్బో వర్ణించలేము ఆ సౌందర్యాన్ని, ప్రయాణం చేస్తుంటే కాళ్ళూ చేతులు చలిజ్వరం వచ్చినట్లు వణుకుతుంటాయి..ఇక చదువు, కమ్యూనికేషన్ వ్యవస్థలు ఇంకా వ్యవస్థాగతం కాలేదు. విద్య, రవాణా సౌకర్యాల కొరత వల్ల మానవవనరులు ఒకే చోట స్తిరపడిపోయాయి, పని లేక ఖాళీ గా ఉన్న యువత ( ప్రధానంగా గ్రామీణ యువత) సోమరిపోతుల్లాగా తయారు అవుతున్నారు, సిగరెట్ల పొగల మధ్య, బిలియర్డ్స్, కోళ్ళ పందాలతో టైంపాస్ చేస్తున్నారు..అయితే వీళ్ళు ఒక విషయంలో మాత్రం బాగానే కష్టపడుతున్నారు...అదే కష్టపడి ఎడా,పెడా పిల్లలను కనడం. ఈ దేశంలో అభివృద్దిలేమికి తోడు ఆందోళన పరిచేరీతిలో అవినీతి మరో పక్క వేధిస్తున్నది. ఏతావాతా అన్నీ సమస్యలే, ఈ సమస్యలను దాటి అభివృద్ది వైపు దేశం పరుగెత్తాలంటే కావాల్సిందల్లా నిబద్దత కలిగి నాయకత్వం. స్వాతంత్ర్యపోరాటంలో దేశ ప్రజలకు స్పూర్తినిచ్చి, ముందుండి ఉద్యమాన్ని నడిపిన జనాన గుసామా, రామోస్ హోర్తా లాంటి స్పూర్తిదాయక నాయకులే ప్రస్తుతం ఏర్పడబోతున్న ప్రభుత్వంలో భాగస్వామ్యులు... దేశ స్వాతంత్ర్యపోరాటం కంటే కూడా  అభివృద్ది వైపు దేశాన్ని నడిపించడం వీరికి మరింత సంక్లిష్టమైనది. ఈ బృహత్ప్రయత్నంలో తైమూరు నూతన నాయకత్వం సఫలం అయి, ప్రపంచదేశాలు "ఔరా" అని అనేంతగా, ఆదర్శకరమైన అభివృద్ది సాధించాలని అందరం ఆశిద్దాం..


                                                            జై తైమూర్....జై జై తైమూర్!!
బ్యాలెట్ బాక్సులు తరలిస్తున్న ఐలు జిల్లా ఐరాస అధికారి, స్తానిక పొలీసు అధికారి
నేను ఓటేసా!
ఓటు వేయడానికి గుర్రమెక్కి వస్తున్న తైమూరు తాత


ఎన్నికల విధులలో "నేను" అంటే నరేందర్ జవ్వాజి

22, జూన్ 2012, శుక్రవారం

తైమూరు ముచ్చట్లు: కాసుల పెళ్ళి



             తైమూరులో  అమ్మాయిల జనభా ఎక్కువే ఉంది... పది లక్షల జనాభాలో అమ్మాయిలు దాదాపు సగం మంది ఉన్నారు.జనాభాలో కూడ ఎక్కువ శాతం Productivity Age Group కు చెందినవారే ఉన్నారు (అంటే 15-35 సంవత్సరాల వయస్సు)... పెళ్ళి జరగాలంటే  తైమూరీ చట్టాల ప్రకారం అబ్బాయికి 18 స౦.లు అమ్మాయికి 15సం.లు ఉంటే సరి. అమ్మాయి పెళ్ళీడుకొచ్చిందంటే మనము తెగ టెన్శన్ పడతాము,కాని ఇక్కడ మాత్రం పెళ్ళంటే అబ్బాయి తల్లిదండ్రులకు  తలప్రాణం తోకకు వస్తుంది..అబ్బాయిని కనగానే సరిపోదు,వాడికి పెళ్ళి చేయకుంటే ఏంబతుకురా బాబు అని అనుకుంటారు.ఎందుకంటారా...కన్యాశుల్కం ఎఫెక్టండీ బాబు (అదేనండి Bride Price), దీనినీ వీరి టెతున్ భాషలో బార్లాకీ (BARLAKI) పద్దతి అంటారు..అబ్బాయికి పెళ్ళి కావాలనుకుంటే సరిపోదు, అమ్మాయికి దండిగా కట్నకానుకలు సమర్పించుకోవాల్సిందే మరి ..అమ్మాయి బ్యాక్ గ్ర్రౌండ్ ను బట్టి ధరవరలలో తేడాలుంటాయి, చదువుకున్న అమ్మాయి,చదువుకోలేని అమ్మాయి,కలవారి అమ్మాయి,ఉద్యోగం చేస్తున్న అమ్మాయి అలాగ ... మినిమం 1,500 డాలర్లనుండి 50,000 డాలర్ల వరకు (మన బక్కచిక్కిన రూపాయి విలువలో అయితే అర లక్ష  నుండి పాతిక లక్షలు ) వదిలించుకోవాలి..దానికి అదనంగా కోళ్ళు,గొర్రెలు,బర్రెలు,ఆవులు, అలాగే పెళ్ళి ఖర్చులు లాంటి కొసరు ఖర్చులు మాములే..ఈ ఖర్చు భరించలేక పుర్రెకో బుద్ది అన్నట్లు అబ్బాయిలు రకరకాల  వివాహా విన్యాసాలు చేస్తుంటారు. కొందరేమో విడతల వారిగా కట్నం చెల్లించుకుంటూ, పెళ్ళి కూడా అలాగే చేసుకుంటారు.అధికారికంగా పెళ్ళి జరిగేవరకు (చర్చిలో) సహాజీవనం కొనసాగిస్తుంటారు.కొన్ని సందర్భాలలో అయితే పిల్లల సమక్షంలో తల్లిదండ్రుల పెళ్ళిళ్ళు జరిగిన దాఖలాలూ ఉన్నాయి.మా  "అమ్మానాన్నల పెళ్ళి" అంటూ పిల్లలు చుట్టాలను పిలుస్తారేమో? మా లాంగ్వేజ్ అసిస్టెంటు (దుబాసీ) ఒకరు కన్యాశుల్కం బారి నుండి తెలివిగా తప్పుకోవడానికి అక్కమొగుడు సినిమాలో రాజశేఖర్ లాగా పెళ్ళి తర్వాత బావమరిది,మరదళ్ళ చదువు,సెటిల్మెంట్ బాధ్యత తీసుకోన్నాడు, ఇప్పటి వరకు ఓ మరదలి పెళ్ళి చేసాడు,ఇంకో మరదలిని,బావమరిదిని తెగ చదివిస్తున్నాడు...

            ఇండియాలో మీకులాగా కన్యాశుల్కం, గిన్యాశుల్కం లేదు అమ్మాయికి పెళ్ళి చేయాలంటే అబ్బాయికి వరశుల్కం సమర్పించుకోవాల్సిందే అని వాళ్ళతో అంటే  ... " అబ్బా మీ భారతీయులు ఎంత అదృష్టం చేసుకున్నారో" అంటూ, ఓ వైపు కాసులు మరో వైపు కాంతామణి, ఒక దెబ్బకు రెండు పిట్టలు అని మన అదృష్టాన్ని తలుచుకొని తెగ కుళ్ళు కుంటున్నారు . మీకేమి తెలుసు బాబు పీత బాధలు పీతవైతే సీత బాధలు సీతవి అని కవర్ చేశాననుకొండి. అయితే ఒకటి మాత్రం నిజం "ఆకు వచ్చి ముల్లు మీద పడ్డా ముల్లొచ్చి ఆకు మీద పడ్డా చిరిగేది ఆకే" అన్నట్లు కట్నం తీసుకున్నా, కట్నం ఎదురిచ్చినా కూడ అక్కడైనా ఇక్కడైనా  ఇంకా ఎక్కడైనా కూడా ఆఖరికి అమ్మాయిలే  బలి అవుతున్నారు . కన్యాశుల్కం ఉంది కదా అంతా అమ్మాయిలదే హవా అనుకుంటే పప్పులో కాలేసినట్లే.. కన్యాశుల్కం పద్దతి ఏమిటో  కాని అది కాంతామణులను నానా కడగండ్ల పాలు చేస్తున్నది. డబ్బులిచ్చి కొన్నాం కాబట్టి సర్వాధికారాలు మావేనంటూ మగవారు ఆడవారిని బానిస చూపు చూస్తారు. ప్రశాంతమైన దేశమే కాని గృహలలో అశాంతి రాజ్యమేలుతుంటుంది. ఏతావాతా గృహహింస విపరీతంగా ఉందనే చెప్పవచ్చు.
                ఇక్కడి జాతీయ ఆరోగ్య సర్వే (2009-10) ప్రకారం మొత్తం 38 శాతం మహిళలు గృహహింస బాధితులు కాగ అందులో 75 శాతం మంది సాక్షత్తు కట్టుకున్న మొగుడి చేతిలో తన్నులు తింటున్నారు. అసలు పోలీసు స్టేషన్లలో నమోదయ్యే కేసులే తక్కువంటే అందులో రిపోర్టు అయ్యేవి ఎక్కువగా గృహహింసకు సంభంధించినవే. అయితే   ఐక్యరాజ్యసమితి లాంటి అంతర్జాతీయ సంస్థల చొరవ, స్వచ్చంద సంస్థల కృషి, పోలీసుల కౌన్సిలింగుల వల్ల  ఇప్పుడిప్పుడే పరిస్థితిలో కొంత మార్పు వస్తున్నది.ఆ మార్పు ఏదో త్వరగా వస్తే బాగుండు.   అయితే మహిళల వేదింపులలో మనకి వీళ్ళకి తేడా ఏమిటంటే.., ఇక్కడ అమ్మాయిని అంతతేసి డబ్బులు పెట్టి కొన్నవాడు కొట్టినా, అమానుషమే అయినా కొంత మేరకు సర్ది చెప్పుకోవచ్చు.  కాని మన సమాజంలో కొనబడ్డ బానిస (అబ్బాయి) తెగబడి యజమాని పైనే (అమ్మాయి) జులుం చెలాయించడం విడ్డూరం కాకపోతే మరేమిటి.