22, జూన్ 2012, శుక్రవారం

తైమూరు ముచ్చట్లు: కాసుల పెళ్ళి



             తైమూరులో  అమ్మాయిల జనభా ఎక్కువే ఉంది... పది లక్షల జనాభాలో అమ్మాయిలు దాదాపు సగం మంది ఉన్నారు.జనాభాలో కూడ ఎక్కువ శాతం Productivity Age Group కు చెందినవారే ఉన్నారు (అంటే 15-35 సంవత్సరాల వయస్సు)... పెళ్ళి జరగాలంటే  తైమూరీ చట్టాల ప్రకారం అబ్బాయికి 18 స౦.లు అమ్మాయికి 15సం.లు ఉంటే సరి. అమ్మాయి పెళ్ళీడుకొచ్చిందంటే మనము తెగ టెన్శన్ పడతాము,కాని ఇక్కడ మాత్రం పెళ్ళంటే అబ్బాయి తల్లిదండ్రులకు  తలప్రాణం తోకకు వస్తుంది..అబ్బాయిని కనగానే సరిపోదు,వాడికి పెళ్ళి చేయకుంటే ఏంబతుకురా బాబు అని అనుకుంటారు.ఎందుకంటారా...కన్యాశుల్కం ఎఫెక్టండీ బాబు (అదేనండి Bride Price), దీనినీ వీరి టెతున్ భాషలో బార్లాకీ (BARLAKI) పద్దతి అంటారు..అబ్బాయికి పెళ్ళి కావాలనుకుంటే సరిపోదు, అమ్మాయికి దండిగా కట్నకానుకలు సమర్పించుకోవాల్సిందే మరి ..అమ్మాయి బ్యాక్ గ్ర్రౌండ్ ను బట్టి ధరవరలలో తేడాలుంటాయి, చదువుకున్న అమ్మాయి,చదువుకోలేని అమ్మాయి,కలవారి అమ్మాయి,ఉద్యోగం చేస్తున్న అమ్మాయి అలాగ ... మినిమం 1,500 డాలర్లనుండి 50,000 డాలర్ల వరకు (మన బక్కచిక్కిన రూపాయి విలువలో అయితే అర లక్ష  నుండి పాతిక లక్షలు ) వదిలించుకోవాలి..దానికి అదనంగా కోళ్ళు,గొర్రెలు,బర్రెలు,ఆవులు, అలాగే పెళ్ళి ఖర్చులు లాంటి కొసరు ఖర్చులు మాములే.. ఖర్చు భరించలేక పుర్రెకో బుద్ది అన్నట్లు అబ్బాయిలు రకరకాల  వివాహా విన్యాసాలు చేస్తుంటారు. కొందరేమో విడతల వారిగా కట్నం చెల్లించుకుంటూ, పెళ్ళి కూడా అలాగే చేసుకుంటారు.అధికారికంగా పెళ్ళి జరిగేవరకు (చర్చిలో) సహాజీవనం కొనసాగిస్తుంటారు.కొన్ని సందర్భాలలో అయితే పిల్లల సమక్షంలో తల్లిదండ్రుల పెళ్ళిళ్ళు జరిగిన దాఖలాలూ ఉన్నాయి.మా  "అమ్మానాన్నల పెళ్ళి" అంటూ పిల్లలు చుట్టాలను పిలుస్తారేమో? మా లాంగ్వేజ్ అసిస్టెంటు (దుబాసీ) ఒకరు కన్యాశుల్కం బారి నుండి తెలివిగా తప్పుకోవడానికి అక్కమొగుడు సినిమాలో రాజశేఖర్ లాగా పెళ్ళి తర్వాత బావమరిది,మరదళ్ళ చదువు,సెటిల్మెంట్ బాధ్యత తీసుకోన్నాడు, ఇప్పటి వరకు మరదలి పెళ్ళి చేసాడు,ఇంకో మరదలిని,బావమరిదిని తెగ చదివిస్తున్నాడు...

            ఇండియాలో మీకులాగా కన్యాశుల్కం, గిన్యాశుల్కం లేదు అమ్మాయికి పెళ్ళి చేయాలంటే అబ్బాయికి వరశుల్కం సమర్పించుకోవాల్సిందే అని వాళ్ళతో అంటే  ... " అబ్బా మీ భారతీయులు ఎంత అదృష్టం చేసుకున్నారో" అంటూ, వైపు కాసులు మరో వైపు కాంతామణి, ఒక దెబ్బకు రెండు పిట్టలు అని మన అదృష్టాన్ని తలుచుకొని తెగ కుళ్ళు కుంటున్నారు . మీకేమి తెలుసు బాబు పీత బాధలు పీతవైతే సీత బాధలు సీతవి అని కవర్ చేశాననుకొండి. అయితే ఒకటి మాత్రం నిజం "ఆకు వచ్చి ముల్లు మీద పడ్డా ముల్లొచ్చి ఆకు మీద పడ్డా చిరిగేది ఆకే" అన్నట్లు కట్నం తీసుకున్నా, కట్నం ఎదురిచ్చినా కూడ అక్కడైనా ఇక్కడైనా  ఇంకా ఎక్కడైనా కూడా ఆఖరికి అమ్మాయిలే  బలి అవుతున్నారు . కన్యాశుల్కం ఉంది కదా అంతా అమ్మాయిలదే హవా అనుకుంటే పప్పులో కాలేసినట్లే.. కన్యాశుల్కం పద్దతి ఏమిటో  కాని అది కాంతామణులను నానా కడగండ్ల పాలు చేస్తున్నది. డబ్బులిచ్చి కొన్నాం కాబట్టి సర్వాధికారాలు మావేనంటూ మగవారు ఆడవారిని బానిస చూపు చూస్తారు. ప్రశాంతమైన దేశమే కాని గృహలలో అశాంతి రాజ్యమేలుతుంటుంది. ఏతావాతా గృహహింస విపరీతంగా ఉందనే చెప్పవచ్చు.
                ఇక్కడి జాతీయ ఆరోగ్య సర్వే (2009-10) ప్రకారం మొత్తం 38 శాతం మహిళలు గృహహింస బాధితులు కాగ అందులో 75 శాతం మంది సాక్షత్తు కట్టుకున్న మొగుడి చేతిలో తన్నులు తింటున్నారు. అసలు పోలీసు స్టేషన్లలో నమోదయ్యే కేసులే తక్కువంటే అందులో రిపోర్టు అయ్యేవి ఎక్కువగా గృహహింసకు సంభంధించినవే. అయితే   ఐక్యరాజ్యసమితి లాంటి అంతర్జాతీయ సంస్థల చొరవ, స్వచ్చంద సంస్థల కృషి, పోలీసుల కౌన్సిలింగుల వల్ల  ఇప్పుడిప్పుడే పరిస్థితిలో కొంత మార్పు వస్తున్నది. మార్పు ఏదో త్వరగా వస్తే బాగుండు.   అయితే మహిళల వేదింపులలో మనకి వీళ్ళకి తేడా ఏమిటంటే.., ఇక్కడ అమ్మాయిని అంతతేసి డబ్బులు పెట్టి కొన్నవాడు కొట్టినా, అమానుషమే అయినా కొంత మేరకు సర్ది చెప్పుకోవచ్చుకాని మన సమాజంలో కొనబడ్డ బానిస (అబ్బాయి) తెగబడి యజమాని పైనే (అమ్మాయి) జులుం చెలాయించడం విడ్డూరం కాకపోతే మరేమిటి.






3 కామెంట్‌లు: