29, జులై 2012, ఆదివారం

తైమూరు ముచ్చట్లు: అనగనగా ఓ మొసలి.....



        అమ్మో మొసలి... సాధారణంగా మొసలి పేరు వింటేనే జనాభాలో ముప్పాతిక శాతానికి మలేరియా జ్వరం వచ్చినట్లు గజగజ వణికిపోతారు.నాకైతే ఆ పేరు వింటే వణుకుడుతో  పాటు ఠంచనుగా ఐమాక్స్ లో రెండు కథలు గుర్తుకు వస్తాయి.మొదటిది గజేంద్రోపాఖ్యానం లోనిది, భూలోకంలోని ఓ కొలనులో మొసలి బారిన చిక్కుకున్న తన భక్తుడైన గజేంద్రుడిని రక్షించడం కోసం శ్రీ మహావిష్ణువు పడకమందిరం నుండే యెకాయెకిన  పరుగు పరుగున బయల్దేరి వెళ్ళి,తన చక్రాయుధంతో మొసలిని సంహారించడం.ఇక రెండవది పంచతంత్రంలోనిది, ఆశగొండి మరియు ఆకలిగొండి అయిన తన ముద్దులభార్య పేరాకలి తీర్చడంకోసం తన స్నేహితుడైన కోతి గుండెకాయకే ఎసరు పెట్టాలని బయల్దేరి... తెలివైన తన కోతిమిత్రుడి చేతిలో భంగపాటుకు గురైన ఓ మందమతి మొసలి కథ. మనందరము మొసలి అంటేనే మొహం చిట్లిస్తాము, పైగా దాన్ని గబ్బర్ సింగ్ ను చూసినట్లు చూస్తాము( అంటే లేటెస్ట్ గబ్బర్ పవన్ కళ్యాణ్ కాదు,..పురానా గబ్బర్.. అంటే విలన్  అని నా ఉవాచ).పైగా  ఎవరైనా రాజకీయనాయకులు తన ప్రజానీకం కష్టాలను చూసి తట్టుకోలేక కన్నీరు ఒలికిస్తే " మొసలి కన్నీరు కారుస్తున్నారని" ఎకసెక్కాలు ఆడుతాము.

కానీ తైమూరు ప్రజలకు అలా కాదు, మొసలి అంటే వారి దృష్టిలో సాక్షాత్తు శ్రీమన్నారయణ అవతారం( సారీ..ఫ్లో లో అలా వెళ్ళిపోయింది, నిజానికి నారాయణుడితో వీరికేమి సంబంధం లేదు..ఐ మీన్ దైవంతో సమానమని)..ఇక మొసలి కంట కన్నీరు ఒలికిందా దేశానికి అరిష్టం, అందరికి పోయే కాలం  ముంచుకొచ్చిందనే ఘాఠ్ఠిగా అనుకుంటారు.ఈ దేశంలో మొసళ్ళను పట్టడం, వేటాడడం, చంపడం లాంటి మొసళ్ళ హానికర చర్యలు పూర్తి గా నిషిద్దం...ఒకవేళ మొసలి ఎవరిపైన దాడి చేసినా కూడా, అయ్యోపాపం అని దాడికి గురైనవాడిపై కాస్తా కనికరం కూడా చూపించరు, పైగా వీడేదో మహాపాపానికి ఒడిగట్టాడు అందుకే "మొసలి దేవుడు"శిక్షించాడని దాడిని సమర్థిస్తారు.  అన్ని రకాల పాకే,వాకే,ఎగిరే,ఈదే జీవులను బ్రేవ్ మని భోంచేసే తైమూర్ సోదరులు మొసలికి మాత్రం మినహాయింపు ఇచ్చారు..మొసళ్ళ భక్షణ కాదు సంరక్షణే మా ధ్యేయం అంటారు. తైమూరు ప్రజల "మొసలి ప్రేమను" చూసి ప్రముఖ మొసళ్ళ వేటగాడు  స్టీవ్ ఇర్వీన్ తెగ సంబరపడిపోయేవాడట( పాపం అంత పెద్ద మోనగాడు కూడా స్టింగరీ అనే ఓ బుల్లి చేప దెబ్బకు బలైపోయాడు, సప్త సముద్రాలు దాటి వచ్చి మురికికాల్వలో పడి చావడం అంటే ఇదేనేమో.... ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరూ...)మొసళ్ళ సంరక్షణకు ఓ టాస్క్ ఫోర్స్ ఏర్పాటుకు, ఇతర సలహాలు, సూచనలు తెగ ఇచ్చేసి వెళ్ళిపోయాడు. వీళ్ళ మొసళ్ళ ప్రేమ ఎంతవరకు వెళ్ళిందంటే, జనాభాలో 60 శాతం మంది మగవాళ్ళ హెయిర్ స్టైల్,ముఖ్యంగా యూత్ అయితే దాదాపు 80 శాతం మంది తల మీది బొచ్చును కూడా మొసలి ని గుర్తుకు తెచ్చేలా కట్ చేయిస్తారు.అసలు మొసళ్ళ పట్ల ఇంత అవ్యాజ్యమైన ప్రేమ ఎందుకు చెప్మా అంటే, అసలు తమ అస్థిత్వానికి మూల పురుషుడు మొసలే అంటారు, తమదంతా "మొసలి వంశమని" కాలరెగిరేస్తారు. తైమూరు ప్రజలకు, మొసలికి ఉన్న అవినాభావ సంబంధం గూర్చి వాడుకలో ఓ జానపదం ప్రచారంలో ఉన్నది. దాని ప్రకారం.....

అనగనగా ఓ చిన్న కొలను, అందులో ఓ బుజ్జి మొసలి ఉండేది. చూడ్డానికి బుజ్జిదే అయినా బుర్రంతా బడా ఆలోచనలు, హైస్కూల్ పోరగాడు ఐఏయస్ కావాలని కలలు కన్నట్లు మన బుజ్జిమొసలికి కూడా ఆ కొలనునుండి త్వరాగా బయటపడి, సముద్రంలో తన ప్రతాపం చూయించాలని తెగ ఆరాటపడేది.ఇంతలో ఆ ప్రాంతంలో తీవ్రమైన దుర్భిక్షపరిస్థితులు ఏర్పడ్డాయి,కొలనులో నీళ్ళు అడుగంటిపోసాగాయి.ఇక అక్కడుంటే తనకు నూకలు చెల్లినట్లేనని భావించిన బుజ్జి మొసలి, ఎలాగు సముద్రం చేరాలనే తన ఆశయం కూడా నెరవేరినట్లవుతుంది అని సముద్రం వైపు వెంటనే ప్రయాణం మొదలు పెట్టింది. ఎంత ప్రయాణం చేసినా సముద్రం అంతూ పొంతూ దొరకడంలేదు, ఓ వైపు మల మాడిస్తున్న సూర్య ప్రతాపం మరో వైపు అల్లల్లాడిస్తున్న ఆకలి ప్రతాపం, ఇక తన పని అయిపొయినట్లేనని బుజ్జి మొసలి ఢీలా పడిపోయింది.ఇంతలోఅటుగా వెళ్తున్న ఓ చిన్నారి బాలుడు బుజ్జి మొసలి బాధను చూసి దాన్ని తన చేతుల్లోకి తీసుకొని వడి వడిగా సముద్రాన్ని చేరుకొని,నీళ్ళల్లో వదిలాడు.ఒక్కసారి నీళ్ళల్లో పడగానే వెయ్యేనుగుల బలం వచ్చినట్లయింది,తనకు ప్రాణభిక్ష పెట్టిన చిన్నారిని మిత్రుడిగా, సోదరుడిగా బుజ్జి మొసలి భావించి, ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఒడ్డుకు వచ్చి తనను పిలవమని చెప్పి సముద్రంలోకి వెళ్ళి పోయింది.


కొంత కాలం గడిచింది...ఓ రోజు బాలుడు సముద్రం ఒడ్డుకు వచ్చి మొసలి సొదరుడిని పిలిచాడు, వెంటనే మొసలి వచ్చింది. మొసలితో బాలుడు" సోదరా నాకు ప్రపంచం చుట్టి రావాలని ఉంది" అని అన్నాడు."ఒస్ అదెంత పని నీవు నా వీపు మీద కూర్చో, నేనంతా చూపిస్తాను" అని మొసలి అని బాలుడిని తన వీపుపైన కూర్ఛొపెట్టుకొని సముద్రప్రయాణం ప్రారంభించింది. ప్రయాణంలో కొన్ని రోజులు గడిచాకా మొసలికి బాలుడిని తినాలన్న కోరిక కలిగింది, కాని ఓ వైపు మనస్కరించక సముద్రంలోని చేపలను, తాబేళ్ళను ఇతర అన్ని జీవులను సలహా అడిగింది..ఎవరిని అడిగినా కూడా " సహాయం చేసిన వాడికి హాని తలపెట్టడం మహాపాపం" అనే చెప్పాయి...అయినా కూడా బాలుడిని కరకర నమిలేయాలనే ఆలోచనతో ఏ ఒక్కరైనా తనను సపోర్ట్ చేయకపోతారా అని కనపడ్డ జీవినల్లా సలహా అడిగింది..కాని ఎవరినుండి కూడా తప్పుడు సలహా రాలేదు..మొసలి ఆలోచనలో పడింది" నిజమే కదా నాకు ప్రాణభిక్ష పెట్టిన సోదరుడిని మట్టుబెట్టాలనుకోవడం ఎంత పాపం" అని తీవ్రంగా ఆవేదన చెందింది. పశ్చాతాపంతో దహించుకుంటూ బాలుడితో " సోదరా నన్ను కాపాడిన నిన్నే కడతేర్చాలని అనుకున్నాను, నా వల్ల ఘోర అపరాధం జరిగింది.ఇప్పుడు నేను ప్రాయశ్చిత్తం చేసుకుంటాను...నేను చనిపోతాను, నా శరీరంపైన నీవు నివసించి నీ వంశాన్ని అభివృద్ది చేయి" అని తైమూరు తీరానికి వచ్చి మొసలి ప్రాణం వదిలింది.ప్రాణం వదిలిన మొసలి పెరిగి, పెరిగి పెద్ద భూభాగంగా ఏర్పడింది,దాని వొంటి మీదనున్న పొలుసులు పెద్ద పెద్ద పర్వతాలు గా ఏర్పడ్డాయి. మొసలి సోదరుడి కోరిక మేరకు బాలుడు పెరిగి పెద్దవాడై పిల్లా,జెల్లతో వంశాన్ని అభివృద్ది చేసాడు..ఆ వంశాంకురాలే నేటి తైమూరు ప్రజలు. ఈ జానపదం నిజమైనదని తైమూరు ప్రజలు బలంగా విశ్వసిస్తారు.అంతగా అనుమానం ఉంటే ఓ సారి తైమూర్ మ్యాప్ ను తెరిచి చూడమంటారు.
నిజమే కావాలంటే తైమూర్ చిత్రం చూడండి  అచ్చుగుద్దినట్లు మొసలి ముఖంలాగా అనిపించడంలేదూ..అన్నట్లు తైమూర్ ప్రజలు సముద్రంలోకి దిగేప్పుడు "ఓ లఫాయి ( అంటే టెటున్ భాషలో మొసలి అని అర్థం) మేము నీ వంశస్తులము, మాకు హాని తలపెట్టకు" అని దూకుతారట. అలా ప్రార్థించి దిగితే తమ తాతలూ,ముత్తాతలు అయిన మొసళ్ళు ఏమి చేయవని వీరి ధీమా!అయితే ఈ కథంతా చదివి మీరూ ఓ ట్రయల్ వేయకండోయ్, ఈ మినహాయింపు కేవలం తైమూరువాసులకే, మీరు దిగారో కరకరకరకరకరకరకరకరే.... ఇదండీ బాబూ తైమూరు ప్రజల “మొసలి ప్రేమ” వెనక ఉన్న అసలు కహానీ. వచ్చేవారం మరో కహానీ చెప్పుకుందాము, అంతవరకు సెలవు మరి...

20, జులై 2012, శుక్రవారం

మిఠాయి పొట్లం: తైమూరు ముచ్చట్లు: పాత ప్రధాని నేతృత్వంలో కొలువుదీర...

మిఠాయి పొట్లం: తైమూరు ముచ్చట్లు: పాత ప్రధాని నేతృత్వంలో కొలువుదీర...: ఈ నెల మొదటి వారంలో పార్లమెంటు ఎన్నికలు జరుపుకున్న తూర్పు తైమూర్ దేశం కొత్త స...

తైమూరు ముచ్చట్లు: పాత ప్రధాని నేతృత్వంలో కొలువుదీరనున్న కొత్త ప్రభుత్వం





ఈ నెల మొదటి వారంలో పార్లమెంటు ఎన్నికలు జరుపుకున్న తూర్పు తైమూర్ దేశం కొత్త సంకీర్ణప్రభుత్వం ఆధ్వర్యంలో తన భవిష్యత్తును నిర్మించుకోనున్నది. పది సంవత్సరాల క్రితం విదేశీ ఇండోనేషియా నియంతృత్వ పాలన నుండి విముక్తి చెంది, ఇన్నాళ్ళూ ఐక్యరాజ్య సమితి చిటికెనవేలు పట్టుకోని నడిచిన తైమూరు ఇక స్వయంగా తన పయనం కొనసాగించనుంది. నాలుగు వందల సంవత్సరాల పోర్చుగీసు వలస పాలన నుండి, ఆ తర్వాత పాతిక సంవత్సరాల ఇండోనేషియా నియంతృత్వ పాలన నుండి బయట పడడానికి తైమూరు ప్రజలు ఎన్నో త్యాగాలు చేసారు, దాదాపు దేశ జనాభాలో మూడవవంతు       (సుమారు మూడులక్షల మంది) బలి  పీఠం ఎక్కిన తర్వాతగాని స్వాతంత్ర్యానికి నోచుకోలేదు. బంగారు పిచ్చుక లాంటి భారతదేశాన్ని కూడ పీల్చిపిప్పి చేసిన విదేశీ వలసపాలన చిన్న ద్వీప దేశమైన తైమూరుకు ఎలాంటి మినహాయింపు ఇవ్వలేదు. తత్ఫలితం ప్రపంచంలో మానవ అభివృద్ది నివేదిక ప్రకారం 146 వ స్థానం. పేరుకు 12 లక్షల జనాభా కలిగిన చిన్న దేశమే కాని కళ్ళ ముందు సవాలక్ష సమస్యలు దర్శనమిస్తున్నాయి. పేదరికం, నిరక్షరాస్యత, మౌలిక వసతుల కొరత, ఆందోళన పరుస్తున్న ప్రజల ఆరోగ్యం, ఇంకా  వంటబట్టని ప్రజాస్వామ్య స్పూర్తి ... ఇవన్ని కొత్త ప్రభుత్వం ముందున్న ముఖ్యమైన సవాళ్ళు.

 దామాషా ప్రాతినిథ్యం పద్దతి ప్రకారం ఎన్నికలు జరుపుకున్న ఈ దేశ పార్లమెంటు లో మొత్తం 65 సీట్లు ఉన్నాయి. ఎన్నికలలో పార్టీలు సాధించిన ఓట్లను బట్టి సీట్లు కేటాయిస్తారు.  సార్వజనిన వయోజన ఓటింగును అవలంభిస్తున్న ఇక్కడ 17 సంవత్సరాలు దాటిన వయోజనులకు ఓటు హక్కు కల్పించారు.ప్రశాంత వాతావరణంలో, అంతర్జాతీయపర్యవేక్షణలో జరిగిన ఎన్నికలలో మొత్తం 6,47,814 మంది ఓటర్లు  21 పార్టీలకు ఓటు వేశారు. కాసుల పంపకాలు, మందు చుక్కలు, మైకుల హోరు, ఫ్లెక్సీల జోరు, విందు భోజనాల హంగామా, హాడావిడి లేని ఎన్నికలివి, ఒక దశలో నాకే అనుమానం వచ్చింది.." అసలు నిజంగానే  ఎన్నికలు జరుగుతున్నాయాని". పోలింగ్ రోజు డ్యూటీ కి వెళ్ళడంతో సందేహాం తీరిపోయింది. మనలాగా ఎలక్ట్రానిక్ ఓటింగు యంత్రాలు లేవిక్కడ..సాంప్రదాయపద్దతిలో 21 పార్టీల గుర్తులున్న బ్యాలెట్ పేపరు వాడారు. అయితే నవ్వోచ్చే విషయం ఏమిటంటే ఓటర్లు బ్యాలెట్ పేపర్ పై  తమకు నచ్చిన, మెచ్చిన పార్టీ గుర్తుపై మేకుతో బొక్క పొడిచి, బాక్సులో వేస్తారు. ఆ తర్వాత మూడుగంటలనుండి అదే సెంటరు లో ప్రారంభం అయ్యే కౌంటింగ్ లో ప్రిసైండింగ్ అధికారి బహిరంగంగా ఒక్కో బ్యాలెట్ పేపర్ ను బయటికి తీసి, ఓక్కొ బొక్కను లెక్కపెడుతు, బోర్డుపై పార్టీలు సాధించిన బొక్కల లెక్కలు రాస్తాడు.తర్వాత బ్యాలెట్ బాక్సులన్నీ దేశరాజధానికి చేరుకుంటాయి..అక్కడ ట్యాబులేషన్ పని  జరుగుతుంది. తైమూరు రాజ్యాంగం ప్రకారం ఎన్నికలు జరిగిన 12 రోజులకు ఎన్నికల ఫలితాలు అధికారికంగా ప్రకటించాలి.


ప్రస్తుత ప్రధాని జనానా గుసామా
ఈ ఎన్నికలలో 21 పార్టీలు పాల్గొన్నాకూడ కేవలం నాలుగు పార్టీలు మాత్రమే సీట్లు సాధించే ఓట్లు సంపాదించుకున్నాయి. ప్రస్తుత ప్రధాని జనాన గుసామా నేతృత్వంలోని CNRT పార్టీ అధికంగా ౩౦ సీట్లు సంపాదించంగా, స్వాతంత్రపోరాటంలో అగ్రగామి గా నిలిచిన FRETLIN పార్టీ 25సీట్లు, మాజీ అధ్యక్షుడు, నోబెల్ బహుమతి గ్రహీత అయిన రామోస్ హోర్తా మద్దతుగల PD పార్టీ 8 సీట్లు, మరో చిన్న పార్టీ 2 సీట్లు సంపాదించుకున్నాయి. మన కాంగ్రేస్ పార్టీ లాగా స్వాతంత్ర్య ఉద్యమంలో ముందునిలిచిన FRETLIN పార్టీకి ఈసారి కూడా తీవ్ర నిరాశ ఎదురయ్యింది.ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 65 సీట్ల పార్లమెంట్ లో 33 సీట్లు ఉండాలి, ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యత లేనందున సంకీర్ణ ప్రభ్హుత్వ ఏర్పాటు తప్పనిసరి అయింది. FRETLIN పార్టీ మీనమేషాలు లెక్కపెడుతుండగానే, ప్రధాని జనానా నేతృత్వంలోని CNRT పార్టీ ఇతర రెండు పార్టీలతో కలిసి, సంకీర్ణం ఏర్పాటుకు రంగం సిద్దం చేసింది. సైన్యంలో అత్యధికంగా మద్దతు గల FRETLIN పార్టీ నిరసన దేశంలో ఆందోళనలకు,అల్లర్లకు దారి తీసింది. ప్రస్తుతానికి తాత్కలికంగా అల్లర్లు ఆగినా, ఎప్పుడైనా తిరిగి చెలరేగడానికి అవకాశం ఉంది.దేశంలో శాంతి భద్రతల పర్యవేక్షణ చేస్తున్న 1300 వందల మంది ఐరాస శాంతి పరిరక్షక బృందం (అంటే మేము), కొత్త ప్రభుత్వానికి బరువు, బాధ్యతలు అప్పగించి ఈ సంవత్సరాంతానికి ఇక్కడి నుండి బయటపడడానికి  రంగం సిద్దం అవుతున్నది. ఐరాస శాంతి పరిరక్షక బృందం వెళ్ళిపోయిన తర్వాత అసలు సవాలు ప్రారంభం అవుతది, పరిణితి చెందని ప్రజాస్వామ్యం, సైన్యం పొషించనున్న పాత్ర అనేవిక్కడ రెండు కీలకమైన అంశాలు, ఏమాత్రం తేడా వచ్చినా కథ మళ్ళీ మొదటికే వస్తుంది.


మాజీ అధ్యక్షుడు, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత రామోస్ హోర్తా
అంతగా వ్యవసాయయోగ్యంగా లేని ఈ దేశం ప్రధానంగా దేశ సముద్ర జలాల్లో విస్తారంగా ఉన్న చమురు నిల్వల పైనే ఆధారపడుతున్నది, దేశ బడ్జెట్లో సుమారు 90 శాతం ఆదాయాన్ని చమురు రంగం భర్తీ చేస్తున్నది. ఈ ఆదాయాన్ని ప్రధానంగా దేశాభివృద్దికి వినియోగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది, ఇండోనేషియా వెళ్తూ, వెళ్తూ అంతంత మాత్రమే ఉన్న మౌలిక వసతులను సర్వనాశనం చేసి వెళ్ళింది. ముఖ్యంగా ఈ దేశ రహాదారులు అక్షరాలా నరకానికి నకళ్ళు అని చెప్పవచ్చు. కొండలూ, గుట్టలు లతో కూడిన పాము మెలికల రోడ్లు, విరిగిపడే కొండ చరియలు, జర్రున జార్చుకొనే లోయలు...అబ్బో వర్ణించలేము ఆ సౌందర్యాన్ని, ప్రయాణం చేస్తుంటే కాళ్ళూ చేతులు చలిజ్వరం వచ్చినట్లు వణుకుతుంటాయి..ఇక చదువు, కమ్యూనికేషన్ వ్యవస్థలు ఇంకా వ్యవస్థాగతం కాలేదు. విద్య, రవాణా సౌకర్యాల కొరత వల్ల మానవవనరులు ఒకే చోట స్తిరపడిపోయాయి, పని లేక ఖాళీ గా ఉన్న యువత ( ప్రధానంగా గ్రామీణ యువత) సోమరిపోతుల్లాగా తయారు అవుతున్నారు, సిగరెట్ల పొగల మధ్య, బిలియర్డ్స్, కోళ్ళ పందాలతో టైంపాస్ చేస్తున్నారు..అయితే వీళ్ళు ఒక విషయంలో మాత్రం బాగానే కష్టపడుతున్నారు...అదే కష్టపడి ఎడా,పెడా పిల్లలను కనడం. ఈ దేశంలో అభివృద్దిలేమికి తోడు ఆందోళన పరిచేరీతిలో అవినీతి మరో పక్క వేధిస్తున్నది. ఏతావాతా అన్నీ సమస్యలే, ఈ సమస్యలను దాటి అభివృద్ది వైపు దేశం పరుగెత్తాలంటే కావాల్సిందల్లా నిబద్దత కలిగి నాయకత్వం. స్వాతంత్ర్యపోరాటంలో దేశ ప్రజలకు స్పూర్తినిచ్చి, ముందుండి ఉద్యమాన్ని నడిపిన జనాన గుసామా, రామోస్ హోర్తా లాంటి స్పూర్తిదాయక నాయకులే ప్రస్తుతం ఏర్పడబోతున్న ప్రభుత్వంలో భాగస్వామ్యులు... దేశ స్వాతంత్ర్యపోరాటం కంటే కూడా  అభివృద్ది వైపు దేశాన్ని నడిపించడం వీరికి మరింత సంక్లిష్టమైనది. ఈ బృహత్ప్రయత్నంలో తైమూరు నూతన నాయకత్వం సఫలం అయి, ప్రపంచదేశాలు "ఔరా" అని అనేంతగా, ఆదర్శకరమైన అభివృద్ది సాధించాలని అందరం ఆశిద్దాం..


                                                            జై తైమూర్....జై జై తైమూర్!!
బ్యాలెట్ బాక్సులు తరలిస్తున్న ఐలు జిల్లా ఐరాస అధికారి, స్తానిక పొలీసు అధికారి
నేను ఓటేసా!
ఓటు వేయడానికి గుర్రమెక్కి వస్తున్న తైమూరు తాత


ఎన్నికల విధులలో "నేను" అంటే నరేందర్ జవ్వాజి