మనసును కదిలించిన పరువు
నా మిత్రురాలు ఝాన్సీ పాపుదేశి చేసిన దేవుడమ్మ రచన నాకు బాగా ఇష్టం, చదివిన తర్వాత చాలా రోజులు అందులోని కథలు, పాత్రలు నన్ను వెంటాడాయి.. ఇప్పుడు కొత్తగా దేవుడమ్మ ఝాన్సీ @ ఝాన్సీ పాపుదేశీ పరువు పేరుతో ఒకఅనువాద రచన చేసింది. దానిని అమెజాన్‌లో ఆర్డర్ చేశాక, వచ్చి 15 రోజులు అవుతున్నా కూడా ప్రతి రోజు చదవాలని పుస్తకాన్ని చేతిలో పట్టుకొని తిరుగుతున్నా కూడా మొదలు పెట్టడం కాలేదు. కానీ చదవలేకపోతున్నానన్న గిల్టీ ఫీలింగ్ మాత్రం వెంటాడుతూనే ఉంది.
నిన్న ఆ అవకాశం దొరికింది. మధ్యాహ్నం పరువు ను ప్రారంభించాను. ఇక ఆపడం నావల్ల కాలేదు. చిన్నప్పుడు, కాలేజీ రోజుల్లో శివరాత్రి నాడు పగలు, రాత్రి తేడా లేకుండా వరుసగా మూడు నాలుగు షోలు చూసెవాడిని. ఇటీవలి కాలంలో ఓటిటీలో నాన్‌స్టాప్‌గా సినిమాలు చూస్తే, దానిని "బింజ్ వాచ్" అంటారని తెలిసింది. ఇప్పుడు నేను పరువు నవలను " బింజ్ రీడ్ " చేసాను. పరువు నవల ఏమాత్రం పెద్దది కాదు, కేవలం 111 పేజీలు మాత్రమే. బండి నారాయణస్వామి శప్తభూమి తర్వాత బింజ్ రీడింగ్ చేసిన పుస్తకం ఇదే. 2000 సంవత్సరములో పంజాబ్ రాష్ట్రంలో జరిగిన అమానవీయ పరువు హత్యే ఈ నవలకు నేపథ్యం.
సామాజిక అంతరాలు ఎక్కువగా ఉన్నా జస్సి,మిట్టు అనే ప్రేమికుల ప్రేమను, అమ్మాయి ఇంటివారు అంగీకరించక, కిరాయి హంతకులను ఎంగేజ్ చేసి ప్రేమికులపై చేసిన దాడిలో జస్సి ప్రాణాలు కోల్పోగా, మిట్టు అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డాడు. కానీ అతనికి అయిన గాయాలు దారుణమైనవే. కన్నకూతురే అయినాకూడా, జస్సి తల్లి కూతురిని "ఏమైనా చేసుకోండి" అని హంతకులను పురమాయించడం హృదయాన్ని బరువెక్కిస్తుంది.
ప్రియురాలి హత్య అనంతరం మిట్టు తన ప్రేమ కోసం, తన ప్రేమను హత్య చేసిన నిందితులు శిక్షించబడాలనే లక్ష్యంతో 25 సంవత్సరాల పాటు మడమతిప్పని పోరాటం చేశాడు. ఆ పోరాటంలో ఆయన అనేక సవాళ్లు ఎదుర్కొన్నాడు, అక్రమ కేసుల పాలయ్యాడు. ఈ నేపథ్యాన్ని జర్నలిస్టు జూపిందర్ జిత్ సింగ్ BUTCHERED FOR LOVE అనే పేరుతో ఇంగ్లీష్ పుస్తకంగా రాశారు. ఆ హృదయాలను కదిలించే రచనను ఇప్పుడు దేవుడమ్మ ఝాన్సీ పరువు పేరుతో తెలుగులో అనువదించారు.
ఈ నవలకు ముందు మాట రాసిన ప్రసేన్ గారు అన్నట్లు "ఇది అనువాదం కాదు, అనుసృజన." ఝాన్సీ పూర్తి స్వేచ్ఛ తీసుకొని చేసిన ఈ రచన చాలా కొత్తగా అనిపిస్తుంది. ఇక కథ విషయానికి వస్తే....ఇది చదువుతుంటే చాలా టీనేజి ప్రేమ సినిమాలు, ముఖ్యంగా మిర్యాలగూడ అమృత–ప్రణయ్ వంటి నిజజీవిత విషాదాంత ప్రేమ కథలు కళ్ళ ముందు కదలాడుతాయి. ఈ రచనలో వినూత్నత ఏమిటంటే ప్రతి పాత్ర తో మనము మమేకం అయిపోతాము, ప్రతీ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి, ఆ పాత్ర తో జర్నీ చేస్తాం. దీనికి కారణం, పాత్రలు ఫస్ట్ పర్సన్‌లో తమ కథ ను మనతో పంచుకోవడం దాంతో మిట్టు బాధలు మనవిగా, జెస్సి ఫీలింగ్స్, ఆమె గుండెలో చేసిన ఆరున్నర అంగుళాల గాయం మనకే అయినట్టు విలవిలలాడుతాము, మిట్టు కు అన్ని విధాలుగా సహాయం చేస్తున్న రచయిత జర్నలిస్టు జపిందర్ మనమే అన్నట్లు కూడా అనిపిస్తుంది.
ప్రసేన్ గారు అన్నట్లు "దుఃఖం పాతదే కావచ్చు కానీ ఝాన్సీ అక్షరాల్లో కన్నీళ్లు కొత్తవి, విషాదం అలవాటు అయిందేమో కానీ వేదన కొత్తది." నవల పూర్తయ్యాక కళ్ళు చెమరుస్తాయి, హృదయం కల్లోలమవుతుంది.
స్వచ్ఛమైన ప్రేమ కంటే అక్రమ సంబంధాలు ఎక్కువ అయి భార్యలు భర్తలను, భర్తలు భార్యలను అత్యంత పాశవికంగా స్కెచ్చులు వేసి చంపుకుంటున్న వార్తలు రోజు చదువుతూ,వింటూ, చూస్తున్న ఈ రోజుల్లో, జస్సి-మిట్టు ల స్వచ్ఛమైన ప్రేమ కథ మాత్రం కొత్తగా అనిపించింది. కెనడా నుండి వచ్చిన రాజకుమారి లాంటి జస్సి, విలేజ్ బ్యాచీ తోట రాముడి లాంటి మిట్టును ప్రేమించడం, నాలుగున్నర సంవత్సరాలు దూరంగా ఉన్నా కూడా వారి మధ్యన ప్రేమ తగ్గకపోవడం, వారి అనుబంధం ఎంత బలమైనదో తెలిసిపోతుంది.
వారిద్దరినీ దూరం చేసేందుకు తల్లి తీవ్రంగాహెచ్చరించినా కూడా ప్రేమికులు ఇద్దరూ వెరవకుండా ముందుకెళ్లడం, ఇక పరువు బజారుపడుతుందని భావించి తల్లి, మేనమామలు కెనడా నుంచే కిరాయి హంతకులను పురమాయించడం హృదయాన్ని కలిచివేస్తుంది. నిందితులను కోర్టులో నిలబెట్టడానికి మిట్టు పడిన కష్టాలు, అతని నోరు మూపించడానికి పెట్టిన అక్రమ కేసులు, ఇండియాలో ఇతర నిందితులకు శిక్షలు ఖరారయినా కెనడాలో దాగిన అసలు నిందితులను రప్పించడానికి రెండు దశాబ్దాలు పట్టడం, అలా ఈ కథలోని వాస్తవాలు వ్యవస్థలోని లోపాలను స్పష్టంగా ఎత్తి చూపిస్తున్నాయి.
నవల పూర్తయ్యాక, 25 సంవత్సరాలుగా జస్సి కోసం పరితపిస్తున్న మిట్టు పరిస్థితిపై జాలి, జస్సి ప్రేమపై అభిమానం, సత్వర న్యాయం చేయలేకపోయిన వ్యవస్థపై కోపం రగులుతుంది, వ్యవస్థ లోపాలను ఖచ్చింతంగా సరిదిద్దాలనిపిస్తుంది, ఝాన్సీ ఉద్దేశం కూడా అదే " కనీసం ఒక్కరినైనా ఈ కథ సెన్సిటైజ్ చేయకపోతుందా, కథ చదివి కంటిలోనో, గుండె లోనో చెమ్మ తగిలి ప్రేమను, ప్రేమించే హృదయాలను గుండెకు హత్తుకొకుండా పోతారా" అని.చిన్న నవల అయినా కూడా ఇది ఇచ్చే అనుభవం, అనుభూతి, సందేశం చాలా గొప్పది.
చివరగా, ప్రతీ రచనకు ఒక ప్రయోజనం ఉండాలంటారు, అలా తన రెండవ రచనను ప్రయోజనపూర్వకం చేసిన దేవుడమ్మ ఝాన్సీ @ ఝాన్సీ పాపుదేశి ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. Proud of you Jhansi,
మీరు కూడా ఈ నవలను చదివి మీ హృదయాలను కదిలించుకుంటారని ఆశిస్తూ ముగిస్తున్నాను.
![]() |
Mittu-Jassi |